● అదనపు కలెక్టర్ సంధ్యారాణి
దుగ్గొండి: జనగణన కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లోని గృహాలను బ్లాక్‌లుగా విభజించాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం పంచాయతీ కార్యదర్శులు, జీపీఓలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో హౌస్ లిస్టింగ్ బ్లాక్ (హెచ్‌ఎల్‌బీ)ల ఏర్పాటులో ఎలాంటి తప్పులు ఉండొద్దన్నారు. ఒక్కో బ్లాక్‌లో 160 నుంచి 180 ఇళ్లు ఉండేలా చూడాలని, బ్లాక్‌లకు హద్దులు ఏర్పాటు చేసి మ్యాపింగ్ చేయాలని పేర్కొన్నారు. ఏప్రిల్ 27 నుంచి జరగనున్న జనగణన కోసం ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. లక్ష్మీపురం, చలపర్తి గ్రామాల్లో అస్తవ్యస్తంగా ఉన్న హెచ్‌ఎల్‌బీలను సరిచేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. మండల పరిధిలో ఉన్న 15,015 ఇళ్లను సముదాయాలుగా విభజించి ఎన్యుమరేటర్లకు అందించడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. జనగణనలో భాగంగా ఇళ్లకు వచ్చిన ఎన్యుమరేటర్లకు వివరాలు చెప్పకపోవడం, విధులకు ఆటంకం కల్పిస్తే చట్టరీత్యా చర్యలతోపాటు జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. తహసీల్దార్ ముస్కు సమ్మక్క, ఎంపీడీఓ లెక్కల అరుంధతి, పంచాయతీ కార్యదర్శులు, జీపీఓలు తదితరులు పాల్గొన్నారు.


