మార్కులు తగ్గినా జీవితం ఆగదు | - | Sakshi
Sakshi News home page

మార్కులు తగ్గినా జీవితం ఆగదు

Apr 10 2026 10:27 AM | Updated on Apr 10 2026 10:27 AM

కాళోజీ సెంటర్‌: విద్యాసంవత్సరం ముగిసింది. విద్యార్థులకు ఇంటర్‌ పరీక్షలు పూర్తయ్యాయి. త్వరలో ఫలితాలు రానున్నాయి. ఉత్తీర్ణులు కాకపోయినా, మార్కులు తగ్గినా జీవితం అంతటితో ఆగిపోదు. మళ్లీ పుంజుకొని విజయం కోసం విద్యార్థులు అడుగులు వేయాలి. ఇంటర్‌ ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ సైకాలజిస్టులు పలు సూచనలు చేస్తున్నారు.

మార్కులే సర్వస్వం కాదు..

జీవితంలో ఓటమిని, విజయాన్ని ధైర్యంతో స్వాగతించాలి. ఫలితం ఏదైనా విజయం వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. మార్కులే సర్వస్వం కాదు. మార్కులు తక్కువ వస్తే తెలివితేటల లోపం కాదని భావించాలి. కేవలం మూడు గంటల పరీక్ష సమయం సహకరించలేదని భావించి దూరదృష్టితో నీ మేధస్సుకు పదును పెట్టాలి. ఓటమి ఒక పాఠం, అపజయం ఎదురైతే కుంగిపోకుండా ఎక్కడ లోపం జరిగిందో తెలుసుకొని రెట్టింపు ఉత్సాహంతో సిద్ధపడాలి. ప్రపంచాన్ని శాసించిన ఎందరో మేధావులు ఒకప్పుడు పరీక్షలు తప్పినవారే అని గుర్తు చేసుకోవాలి. అపజయం నుంచి అడుగులు పడితేనే విజయం నీ దరిచేరుతుంది.

లోపాలను ప్రేమతో సరిదిద్దాలి..

పరీక్ష ఏదైనా ఫలితాల సమయంలో తల్లిదండ్రులు పిల్లలకు అండగా ఉండాలి. మేము ఉన్నాం అనే భరోసా ఇవ్వాలి. మార్కులు తక్కువ వచ్చాయని పిల్లలను నిందించి చిన్నచూపు చూస్తే వారు పెద్ద ప్రమాదంలో పడొచ్చు. ఎదుటివారితో పోల్చడం మానాలి. ఆత్మవిశ్వాసం సన్నగిల్లేలా దూషించకుండా ధైర్యం చెప్పాలి. ఏడాది పొడవునా శ్రమించారని పిల్లలను అభినందించాలి. లోపాలను ప్రేమతో సరిదిద్దే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది.

అసలైన గెలుపు కోసం

మళ్లీ అడుగులు వేయాలి

విద్యార్థులు, తల్లిదండ్రులకు

సైకాలజిస్ట్‌ల సూచన

త్వరలో విడుదల కానున్న

ఇంటర్మీడియట్‌ ఫలితాలు

ఓడినప్పుడు కుంగిపోవొద్దు..

జీవితం అంటే పరీక్షలు మాత్రమే కాదు.. పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమే. గెలిచినప్పుడు పొంగిపోకుండా, ఓడినప్పుడు కుంగిపోకుండా ఉండడమే నిజమైన వ్యక్తిత్వం. విద్యార్థులకు మార్కుల కంటే సంస్కారం, ధైర్యం, పట్టుదల నేర్పించడం ఈ సమయంలో అత్యంత అవసరం. తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటే నేడు విఫలమైన విద్యార్థి రేపు అద్భుత విజేత అవుతాడు. ఒక మార్కుల షీట్‌ మీబిడ్డ మేధస్సును కొలవగలదేమే కాని వారి భవిష్యత్‌ను కాదు. ఈ సమయంలో తల్లిదండ్రుల అండే వారికి కొండంత ధైర్యం.

– పోగు అశోక్‌, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌,

అధ్యక్షుడు, తెలంగాణ సైకాలజిస్ట్స్‌ అసోసియేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement