పర్వతగిరి: గ్రీవెన్స్‌లో వచ్చిన ఫిర్యాదులపై జిల్లా పంచాయతీ అధికారి కల్పన గురువారం అన్నారం షరీఫ్‌లో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు నిబంధనల మేరకు పనిచేయాలని ఆదేశించారు. దర్గాకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా షాపుల నిర్వాహకులు సామగ్రిని గ్రామపంచాయతీ ఇచ్చిన రెడ్‌మార్క్ లోపల పెట్టాలని సూచించారు. లేకుంటే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, పాలకవర్గ సభ్యులను కోరారు. అనంతరం అన్నారం బస్టాండ్ వద్ద గ్రామపంచాయతీ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. డీఎల్‌పీఓ వేదవతి, తహసీల్దార్ వెంకటస్వామి, ఎంపీడీఓ శంకర్, ఎంపీఓ శేషు, సర్పంచ్ మహేందర్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.
అరైవ్–అలైవ్ కార్యక్రమం
అమలుపై సమీక్ష
న్యూశాయంపేట: అరైవ్–అలైవ్ కార్యక్రమం అమలుపై గురువారం హైదరాబాద్ సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రోడ్డు భద్రతకు తగిన చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాల సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వాహనాల సంఖ్య పెరగడం, అతివేగంతో డ్రైవింగ్ చేయడం ఈ ప్రమాదాలకు కారణ మన్నారు. కలెక్టర్లు రోడ్డు భద్రతకు ప్రాధాన్యమి స్తూ, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
వ్యక్తిగత పరిశుభ్రత
పాటించాలి
నర్సంపేట రూరల్: ప్రతిఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని డీఎంహెచ్‌ఓ సాంబశివరావు సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా వరంగల్ సెంట్రల్ జైలు, నర్సంపేట సబ్‌జైలులో గురువారంఆయన వైద్యశిబిరాలను ప్రారంభించి మాట్లాడారు. జైలులో ఖైదీలు, సిబ్బంది, వివిధ అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి పరీక్షలు, చికిత్స చేయించనున్నట్లు తెలిపారు. సాధారణంగా సంక్రమిత, అసంక్రమిత వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. మానసిక ఒత్తిడి, శరీరకశ్రమ లేకపోవడం కూడా వ్యాధులు రావడానికి కారణమని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు యోగా, ధ్యానం, చేయాలని కోరారు.
దరఖాస్తు గడువు పొడిగింపు
న్యూశాయంపేట: షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగ యువతకు చేయూత నిచ్చే మినీ డెయిరీ పథకం (రెండు పాడిగేదెలు)నకు దరఖాస్తుల గడువు ఈనెల 16 వరకు పొడిగించినట్లు జిల్లా కార్యనిర్వాహక సంచాలకులు సురేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఓబీఎంఎంఎస్ పోర్టల్‌లో దరఖాస్తులు సమర్పించాలని కోరారు. మరిన్ని వివరాలకు హనుమకొండ సర్క్యూట్‌హౌస్ రోడ్డులోని తుషారా స్కూల్ ఎదుట ఉన్న కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు.
హమాలీ ఆత్మహత్య
నర్సంపేట రూరల్: హమాలీ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నర్సంపేటలో గురువారం జరిగింది. స్థానికుల కథనం ప్రకా రం.. పట్టణంలోని మాదన్నపేట రోడ్డులో పంబి రమేశ్ (49) నివాసం ఉంటూ హమాలీ పని చేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఇంటి సమీపంలోని మామిడి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై రవికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించారు. మృతుడి కుమారుడు సాయికుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


