పంట ఉత్పత్తులను నేరుగా విక్రయించుకోవాలి
దుగ్గొండి: పంట ఉత్పత్తులను రైతు ఉత్పత్తి సంఘాల ఆధ్వర్యంలో దళారులు లేకుండా నేరుగా విక్రయించుకోవాలని స్పైసెస్ బోర్డు ఆప్ ఇండియా అసిస్టెంట్ డైరెక్టర్ జ్యోతిశ్ సూచించారు. గిర్నిబావి గ్రామ పంచాయతీ ఆవరణలో గిర్నిబావి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో పసుపు, మిరప రైతులకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పసుపు, మిరప పంటల ఉత్పత్తి, నాణ్యతా ప్రమాణాలు, ఆరబెట్టడం, గ్రేడింగ్, ప్యాకింగ్ చేయడం, నిల్వ చేసే విధానాలను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు నేరుగా కొనుగోలుదారులతో అనుసంధానమైతే మంచి ధరలు పొందవచ్చన్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటల సంరక్షణ, పోస్టు హార్వెస్టు మేనేజ్‌మెంట్‌కు స్పైసెస్ బోర్డు పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. సదస్సులో సర్పంచ్ పెండ్లి వెంకటేశ్వర్లు, రైతు ఉత్పత్తి సంఘం బాధ్యులు పెండ్యాల లలిత, కరుణాకర్, సిరిపల్లి గిరిబాబు, బోర్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు.


