21వ వార్డులో అంచనాలు తలకిందులు..
నర్సంపేట: నర్సంపేటలోని 30 వార్డుల్లో 21వ వార్డు గురించి చర్చ నడిచింది. ఇదే వార్డులో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. కాస్ట్‌లీ వార్డుగా నిలిచింది. ఒక్కో ఓటుకు అత్యధికంగా రూ.8వేల వరకు పంపిణీ చేసినట్లు తెలిసింది. కౌంటింగ్ సమయంలో ప్రతీ ఒక్కరు ఇదే వార్డుపై చర్చించడం కనిపించింది. చివరగా కాంగ్రెస్ అభ్యర్థి ఓర్సు అంజలిపై బీఆర్‌ఎస్ అభ్యర్థి శివరాత్రి స్వామిని గెలుపు వరించింది. దీంతో అంచనాలు తలకిందులయ్యాయి.
ఏడో వార్డులో అత్యధికం.. ఒకటో వార్డులో అత్యల్పం
నర్సంపేట ఏడో వార్డుకు చెందిన కాంగ్రెస్ అభ్యర్థి గంధం నరేందర్ 692 అత్యధిక ఓట్ల మెజార్టీ, అత్యల్పంగా ఒకటో వార్డు అభ్యర్థి 15 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 30 వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య ఉత్కంఠ పోరు జరిగింది. ఏడో వార్డు నుంచి పోటీ చేసిన నరేందర్‌కు 920 ఓట్లు రాగా తన సమీప అభ్యర్థి బీఆర్‌ఎస్‌కు చెందిన మోతె తిరుపతిరెడ్డికి 228 ఓట్లు రాగా.. నరేందర్ గెలుపొందారు. ఒకటో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి మేఘనకు 669 ఓట్లు, బీఆర్‌ఎస్ అభ్యర్థి కవితకు 654 ఓట్లు పోలయ్యాయి. దీంతో 15 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు.
నర్సంపేటలో కౌంటింగ్ ఆలస్యం..
అధికారుల నిర్లక్ష్యంతో నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ శుక్రవారం ఆలస్యమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఫలితాలు గంట వ్యవధిలోనే వచ్చినప్పటికీ నర్సంపేటలో మాత్రం గంటన్నర ఆలస్యంగా ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. దీంతో ఒక దశలో ఉత్కంఠత నెలకొంది. అధికారులు మాత్రం స్పందించకపోవడంతో మీడియా ప్రతినిధులతోపాటు అభ్యర్థులు సైతం అసహనం వ్యక్తం చేశారు. మూడు రౌండ్లు ఫలితాలు ప్రకటించే క్రమంలో రౌండ్ రౌండ్‌కు మధ్య చాలా సమయం పట్టింది. అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాల వైపు దూసుకురావడంతో వెంటనే పోలీసు అధికారులు అప్రమత్తమై సర్దిచెప్పి తిరిగి పంపారు.
నోటాకు 70 ఓట్లు
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నర్సంపేటలో పలువురు ఓటర్లు నోటాకు సైతం ఓటు వేశారు. 30 వార్డుల పరిధిలో 70 ఓట్లు నోటాకు పోలయ్యాయి. రెండో వార్డులో నాలుగు, నాలుగులో రెండు, ఐదులో రెండు, 6లో ఒకటి, 7లో రెండు, 8లో ఒకటి, 9లో మూడు, 10లో రెండు, 11లో ఒకటి, 14లో రెండు, 15లో రెండు, 16లో మూడు, 17లో 8, 18లో ఒకటి, 19లో ఒకటి, 20లో 11, 22లో 5, 23లో నాలుగు, 24లో మూడు, 25లో రెండు, 26లో రెండు, 27లో 4, 28లో మూడు, 30లో ఒకటి చొప్పున పోలయ్యాయి.
అప్పుడు భార్య.. ఇప్పుడు భర్త
వర్ధన్నపేట: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వర్ధన్నన్నపేట 8 వార్డు నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసిన అభ్యర్థి పాలకుర్తి సారంగపాణి ఇప్పడు గెలుపొందారు. గతంలో ఆయన సతీమణి సుజాత బీఆర్‌ఎస్ తరఫున ఏడో వార్డు నుంచి పోటీ చేసి కౌన్సిలర్‌గా గెలుపొందారు.
21వ వార్డులో అంచనాలు తలకిందులు..


