
భూ భారతి దరఖాస్తులు త్వరగా పరిష్కరించండి
● కలెక్టర్ స్నేహ శబరీష్
ఐనవోలు: భూ భారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. మండలంలోని మరియపురం ప్రభుత్వ పాఠశాలను బుధవారం ఆమె సందర్శించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. పాఠశాలలో కేవలం 49 మంది మాత్రమే ఉండగా.. అందుకు కారణాలను ఎంఈఓ పులి ఆనందంను అడిగి తెలుసుకున్నారు. సింగారంలో అంగన్‌వాడీ సెంటర్‌ను సందర్శించి ప్రైవేట్ స్కూళ్లకు విద్యార్థులు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఐసీడీఎస్ సీడీపీఓ విశ్వజకు సూచించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. కార్యాలయంలో తగినంత స్టాఫ్ ఉన్నారా? సమస్యలేంటి? అని తహసీల్దార్‌ను అడిగి తెలుసుకున్నారు. బుధవారం ఎన్ని స్లాట్‌లు బుక్ అయ్యాయో తెలుసుకుని తనముందే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగించాలన్నారు. భూభారతి సదస్సులో 3,800 అప్లికేషన్లు రాగా.. సాదాబైనామా కాకుండా సక్సేషన్, మ్యుటేషన్, నేమ్ కరక్షన్, డీఎస్ పెండింగ్ తదితర మాడ్యూల్స్ విచారణలో భాగంగా నోటీస్‌లు అందించే ప్రక్రియ జరుగుతున్నట్లు తహసీల్దార్ విక్రమ్‌కుమార్ కలెక్టర్‌కు వివరించారు. ఎంపీడీఓ నర్మద, డీటీ రాజ్‌కుమార్, ఆర్‌ఐలు రాణి, మల్లయ్య, సొసైటీ సీఈఓ సంపత్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్‌కు వినతి
కలెక్టర్ ఆకస్మికంగా తహసీల్ కార్యాలయానికి రావడంతో అప్పటికే కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న రైతు సంఘం నాయకులు రైతుల సమస్యలకు సంబంధించి 7 అంశాలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఇందులో తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.చుక్కయ్య, నాయకులు కాడబోయిన లింగయ్య, కరెడ్డి, నారాయణరెడ్డి, గోపాల్‌రావు, రామారావు తదితరులు ఉన్నారు.