ఘనంగా సైలానీ బాబా గంధం జాతర
దామెర: మండలంలోని ఒగ్లాపూర్ సమీపంలోని సైలానీబాబా దర్గా గంధం ఉర్సు ఉత్సవాలు బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు గంధం సమర్పణ కార్యక్రమం కనులపండువగా సాగింది. ఈసందర్భంగా ఫైనాన్స్ కమిషన్ వైస్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, పరకాల ఆర్డీఓ కె.నారాయణ, ఏసీపీ సతీశ్‌బాబు, తహసీల్దార్ జ్యోతివరలక్ష్మీదేవి, సీఐ రంజిత్‌రావు, ఎస్సై అశోక్ విద్యుత్ ఏఈ రమేశ్, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు చాదర్లను తీసుకొచ్చి భక్తి శ్రద్ధలతో సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన ఒంటెలపై గంధం తీసుకొచ్చే తంతు కనులపండువగా సాగింది. మహారాష్ట్ర నుంచి వచ్చిన డప్పు కళాకారుల నృత్యాలు, ఫకీర్ల విన్యాసాలు ప్రదర్శిస్తుంటే దర్గా ప్రధాన ద్వారం నుంచి దర్గా వరకు ఊరేగింపుగా వచ్చి గంధం సమర్పించారు. దర్గా పీఠాధిపతి మహ్మద్ అబ్దుల్ హమీద్(సైలానీబాబా) ప్రత్యేక ప్రార్థనలు చేస్తుండగా భక్తులు భక్తి పారవశ్యంలో మునిగితేలారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ నుంచి భక్తులు హాజరయ్యారు.
పెద్ద ఎత్తున హాజరైన ముస్లింలు
ఘనంగా సైలానీ బాబా గంధం జాతర


