
సమీకృతం సాకారమయ్యేనా..?
నర్సంపేట: నర్సంపేటలోని జిల్లాస్థాయి కూరగాయల మార్కెట్, వారంతపు సంతకు ప్రాధాన్యత ఉంది. చాలా ఏళ్లుగా మార్కెట్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో ప్రజలకు ఇబ్బందిగా మారింది. రూ.2 కోట్ల వ్యయంతో పట్టణంలోని అంగడి ఆవరణలో నిర్మించిన సమీకృత మోడల్ కూరగాయల భవనాన్ని 2021 మే 28న ప్రారంభించారు. కానీ, నాటి నుంచి మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యంతో నాలుగేళ్లుగా భవనం వినియోగంలోకి రాలేదు. చిరు వ్యాపారస్తులు కూరగాయల విక్రయాలను అంగడి గ్రౌండ్‌లోనే కొనసాగిస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే గ్రౌండ్ అంతా తడిసి బురదమయం కావడంతో వ్యాపారస్తులు, వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతోపాటు అంగడి సమీపంలోనే చిరు వ్యాపారుల కోసం రూ.7లక్షల 50వేలతో నిర్మించిన రేకుల షెడ్డును కూడా వ్యాపారస్తులకు కేటాయించకపోవడంతో వృథాగా మారింది. జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన నర్సంపేట వారంతపు సంతను ప్రధాన రహదారిపై నిర్వహిస్తుండడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుంది. రోడ్లపైనే వ్యాపారులు దుకాణాలను ఏర్పాటు చేసుకుంటుండడంతో భద్రాచలం, మహబూబాబాద్, వరంగల్‌కు వెళ్లే వాహనాలకు అంతరాయం ఏర్పడుతుంది.
వినియోగంలోకి వచ్చేనా..
రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన సమీకృత మార్కెట్ భవనం నిరుపయోగంగా ఉండడాన్ని గ్రహించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మంగళవారం భవనాన్ని పరిశీలించి ఇబ్బందులను తెలుసుకున్నారు. చిరు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండేందుకు చేపట్టాల్సిన పనులను ఇంజనీరింగ్ అధికారుల ద్వారా తెలుసుకున్నారు. దీంతోపాటు చిరు వ్యాపారస్తుల సంఘం నాయకులతో చర్చించి ఏ విధమైన అభివృద్ధి పనులు చేపట్టాలనే విషయంపై చర్చించారు. దీంతో బుధవారం సంబంధిత అధికారులతోపాటు కాంట్రాక్టర్లు భవనం వద్దకు వెళ్లి కార్యచరణపై పరిశీలించారు. ఇప్పటికై నా మార్కెట్ భవనం వినియోగంలోకి తెచ్చి తమకు కేటాయించాలని వ్యాపారులు కోరుతున్నారు.
రూ.2కోట్లతో మోడల్ మార్కెట్ భవన నిర్మాణం
నాలుగేళ్లుగా నిరుపయోగం
ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యాపారస్తులు
ఎమ్మెల్యే చొరవతో అధికారుల్లో చలనం