వనపర్తిటౌన్: పార్టీ ఆదేశాలను ఉల్లంఘించే వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే మేఘారెడ్డితో కలిసి నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల, గ్రామస్థాయిలో పార్టీ కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించి.. వాటి నివేదికలను జిల్లా కార్యాలయానికి పంపాలని సూచించారు. సమావేశాలకు గైర్హాజరయ్యే పదాధికారులకు నోటీసులు జారీ చేయాలని, వరుసగా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం బీఎల్‌ఏ–2లకు సర్ ప్రక్రియపై నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. గాంధీ భవన్ నుంచి వచ్చిన శిక్షకుడు మల్లేష్ యాదవ్ బీఎల్‌ఏలకు శిక్షణ ఇచ్చారు. నోటీసులు అందుకున్న ఓటర్లు నిర్ణీత గడువులో విచారణకు హాజరై అవసరమైన పత్రాలు సమర్పించేలా అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. అదే విధంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.


