ట్రామా కేర్‌ కలేనా? | - | Sakshi
Sakshi News home page

ట్రామా కేర్‌ కలేనా?

Jun 29 2026 12:53 AM | Updated on Jun 29 2026 12:53 AM

ఉన్నవి వినియోగించరూ.. కొత్తవి నిర్మించరూ
గోల్డెన్‌ అవర్‌లో వైద్యం అందక గాల్లో కలుస్తున్న ప్రాణాలు

ఉమ్మడి జిల్లాలో దాదాపు 600కి.మీ. మేర జాతీయ రహదారుల విస్తరణ

ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర

చికిత్సకు అవస్థ

వైద్యారోగ్యశాఖ మంత్రి హామీ ఇచ్చినా.. ముందుకు కదలని వైనం

మహబూబ్‌నగర్‌ క్రైం: జాతీయ రహదారుల విస్తరణతో వాహనాల వేగం పెరుగుతోంది.. కానీ అదే వేగంతో విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే ప్రాణాలు కాపాడాల్సిన ’గోల్డెన్‌ అవర్‌’ (తొలి గంట)లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర వైద్యం అందకపోవడంతో రోజురోజుకూ మరణాల సంఖ్య ఆందోళనకరంగా మారుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా జాతీయ రహదారుల వెంట ప్రతి 30 కిలోమీటర్లకు ఒక థర్డ్‌ లెవల్‌ ట్రామా కేర్‌ యూనిట్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని ఏప్రిల్‌ 10న జరిగిన సమావేశంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్వయంగా ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు దానిపై ఎలాంటి ముందడుగు పడలేదు. రెండున్నరేళ్లలో ఉమ్మడి జిల్లాలో దాదాపు 4,231 రోడ్డు ప్రమాదాలు జరగగా.. 2,109 మంది మృత్యవాతపడ్డారని నివేదికలు చెబుతున్నాయి.

13 ఏళ్ల క్రితమే ప్రతిపాదనలు

ఉమ్మడి జిల్లా మీదుగా 44, 167, 167ఏ, 765 నంబర్‌ జాతీయ రహదారులు ఉన్నాయి. దాదాపు 600 కి.మీ.మేర విస్తరించి ఉంది. కనీసం 12 ట్రామాకేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ప్రమాదాలు జరిగినప్పుడు పోలీసులు, అధికారులు హడావుడి చేయడం మినహా దాని తీవ్రత తగ్గించే ప్రయత్నాలు కనిపించడం లేదు. అత్యవసర చికిత్స అందకపోవడంతో అర్ధరాత్రి, తెల్లవారుజామున జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య పెరుగుతోంది. ట్రామా కేర్‌ సెంటర్‌ లేకపోవడం, గోల్డెన్‌ అవర్‌లో చికిత్స అందకపోవడం, జనరల్‌ ఆస్పత్రిలో సరైన వసతులు లేక ప్రాణనష్టం సంభవిస్తోంది. ఎన్‌హెచ్‌–44పై 2013లో ట్రామాకేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రధానంగా బాలానగర్‌–రాజాపూర్‌ మధ్యలో, జానంపేట, కొత్తకోట, పెబ్బేర్‌, ఎర్రవల్లి, అలంపూర్‌ ఎక్స్‌రోడ్‌ దగ్గర ట్రామా కేర్‌ భవనాలు నిర్మించాలని ప్రతిపాదనలు తయారు చేసిన ఇప్పటి వరకు పూర్తి కాలేదు.

ఉమ్మడి జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రిలో రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించే పరికరాలు, సౌకర్యాలు, వైద్యులు కూడా అందుబాటులో లేరు. అత్యవసరంలో స్కానింగ్‌ చేయడానికి ఎంఆర్‌ఐ స్కానింగ్‌ మిషన్‌ లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఇక అత్యవసర వైద్య సేవల కోసం నాగర్‌కర్నూల్‌, గద్వాల, వనపర్తి, నారాయణపేట, జడ్చర్లలో మూడేళ్ల క్రితం 50 పడకలతో క్రిటికల్‌ కేర్‌ యూనిట్లు మంజూరయ్యాయి. వీటిలో ఒక్క నాగర్‌కర్నూల్‌ మినహా మిగతావి పనులు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. కొల్లాపూర్‌, అచ్చంపేట, కల్వకుర్తి, నారాయణపేట, కోస్గి, వనపర్తి, పెబ్బేరు, గద్వాల, మక్తల్‌, కొత్తకోట, తదితర ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగితే మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌ లేదా కర్నూలుకు తరలించాల్సి వస్తుంది. ప్రయాణానికి కనీసం 2 నుంచి 4 గంటల సమయం పడుతుండడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

–9లో u

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement