వనపర్తి విద్యావిభాగం: పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్, శ్రీధర్స్ కాలేజ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌ఐ నియామక శిక్షణ ప్రవేశ పరీక్ష ఆదివారం ముగిసింది. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పి.మధుకర్‌స్వామి, డీసీపీ సారథ్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణనిచ్చేందుకు ఈ పరీక్ష నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 47 కేంద్రాలు, ఉమ్మడి జిల్లాలో నాలుగు కేంద్రాల్లో పరీక్ష జరగగా.. జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగిన పరీక్షకు 242 మంది అభ్యర్థులు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు నాలుగు నెలల పాటు ఉచితంగా పోలీస్ నియామక శిక్షణ ఇవ్వనున్నట్లు పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ గద్దె భాస్కర్ తెలిపారు. కార్యక్రమంలో సాహితి కళావేదిక అధ్యక్షుడు శంకర్‌గౌడ్, సత్తార్, శివలింగం, రమేష్, ఉప్పరి తిరుమ లేష్, కండ్రెని వెంకటేష్, బి.రాము, శ్రీధర్స్ కాలేజ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
కోటిలింగేశ్వరస్వామికి లక్ష పుష్పార్చన
కొత్తకోట రూరల్: మండలంలోని కానాయపల్లి స్టేజీ సమీపంలో ఉన్న కోటిలింగేశ్వర దత్తక్షేత్రం 19వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం లక్ష పుష్పార్చన, బిల్వార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రెండోరోజు జరిగిన పూజల్లో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని అర్చకుల వేదమంత్రోచ్ఛారణల నడుమ పుష్పాలు, బిల్వ దళాలు స్వామివారికి సమర్పించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్న ప్రసాద వితరణ చేపట్టారు.
ఉత్సాహంగా ఫుట్‌బాల్ జట్టు ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో ఆదివారం జిల్లాస్థాయి సబ్ జూనియర్ ఫుట్‌బాల్ బాలికల ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి.భానుకిరణ్ మాట్లాడుతూ జూలై 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నిజామాబాద్ జిల్లాలో రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలికల ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఉంటుందని తెలిపారు. జిల్లాస్థాయి ఎంపికలకు వివిధ ప్రాంతాల నుంచి 50 మంది క్రీడాకారిణులు హాజరుకాగా 25 మందిని ప్రాబబుల్స్‌కు ఎంపిక చేసినట్లు తెలిపారు. వీరికి రెండు రోజులపాటు క్యాంప్ నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ సభ్యులు కేఎస్ నాగేశ్వర్, నందకిషోర్, కోచ్‌లు రాములు, నరేష్, రాజ్‌కుమార్, ప్రేమ్, ప్రకాశ్ పాల్గొన్నారు.
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తిచేయాలని ిసీపీఐ మాజీ జిల్లా కార్యదర్శి పరమేశ్‌గౌడ్ డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేసి ఎన్ని నిధులు అవసరమో, తక్షణం కేటాయించి పూర్తిచేసి ఈ రైతాంగానికి చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని కోరారు. కేసీఆర్ హయాంలో తుమ్మిళ్ల ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని, కానీ దానికి రిజర్వాయర్, కాల్వల నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే పూర్తి చేస్తే అల్లంపూర్ రైతాంగానికి మేలు జరుగుతుందని తెలిపారు. కేఎల్‌ఐ, భీమా ఫేస్ 1, 2, నెట్టెంపాడ్, కోయిల్‌సాగర్, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణ పనులకు త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కర్ణాటక ప్రాంతం, దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కృష్ణాడెల్టాలో వాళ్ల నీటివాటా కంటే అధికంగా నీళ్లను తరలించకపోతున్న రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకునీరంటినట్లుగా వ్యవహరిస్తుందని ఆరోపించారు.


