రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం

Jun 23 2026 7:43 AM | Updated on Jun 23 2026 7:43 AM

అచ్చంపేట రూరల్‌: రాష్ట్రంలో రైతు సంక్షేమ పాలన సాగడం లేదని, రైతు వ్యతిరేక ప్రభుత్వంగా పేరొందుతుందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం అచ్చంపేటలో నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం, సర్‌, సభ్యత్వ నమోదు ప్రత్యేక కార్యక్రమంపై నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలోనూ కొడంగల్‌లో రేవంత్‌రెడ్డిని చిత్తుగా ఓడించామని, రాజకీయ సన్యాసం చేస్తానని ప్రగల్భాలు పలికిన రేవంత్‌రెడ్డి రాజకీయంలోనే కొనసాగుతున్నారన్నారు. నల్లమల బిడ్డను అని చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో నీచమైన పనులు చేస్తున్నాడని, అబద్ధాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా పని చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, ఆయన ఎనుముల రేవంత్‌రెడ్డి కాకుండా.. ఎగబెట్టే రేవంత్‌రెడ్డిగా మారాడన్నారు. రైతులనే కాదు దేవుళ్లకు సైతం ద్రోహం చేశాడని విమర్శించాడు. ప్రశ్నిస్తే పగబడుతున్నాడని, అక్రమ కేసులు నమోదు చేయించి మానసికంగా వేధిస్తున్నాడని మండిపడ్డారు. ఎస్‌బీఐని నిషేధించి రాష్ట్రంలో కొండల్‌రెడ్డి బ్యాంకు పెట్టేలా వ్యవహరిస్తున్నాడన్నారు. ప్రభుత్వంలోకి రాకముందు ఏడాదికి మూడుసార్లు రైతుబంధు ఇస్తానని రైతులను మోసం చేశాడన్నారు. రైతులకు రైతుబంధు కింద సీఎం రేవంత్‌రెడ్డి రూ.29,358 కోట్లు బకాయి పడ్డారని, చిల్లర చేష్టలు చేస్తూ నల్లమల ప్రతిష్టను తగ్గిస్తున్నాడని అన్నారు. మాటల్లోనే రైతు ప్రభుత్వం కనిపిస్తుందని, చేతల్లో లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెడితే కేసీఆర్‌ కొనసాగించారని, ప్రస్తుత సీఎం పథకానికి ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారన్నారు. స్కాముల ప్రభుత్వంగా మారిందని, తుగ్లక్‌ పాలనను తలపిస్తున్నాడని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండి సర్‌ ప్రోగ్రాంలో చాకచక్యంగా, జాగ్రత్తగా పనిచేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, మాజీ ఎమ్మెల్యేలు మర్రిజనార్దన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్‌, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్‌, మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌

హరీశ్‌రావు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement