● వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
పాన్‌గల్: కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం రద్దుకు స్వస్తి పలికి పాత చట్టాన్నే కొనసాగించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని రేమద్దులలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ పార్టీ ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం 90 శాతం పేదల పొట్ట నింపే ఉపాధిహామీ చట్టాన్ని నీరుగార్చేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఆ చట్టాన్ని రద్దుచేసి దాని స్థానంలో వీబీజీ రాంజీ చట్టాన్ని తీసుకొచ్చి బడ్జెట్‌ను తగ్గించి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనుందని.. దీంతో సామాన్య కూలీలు ఇబ్బందులకు గురవుతారని తెలిపారు. గతంలో ఉన్న పాత చట్టాన్నే కొనసాగిస్తూ పనిదినాలు 200 రోజులకు పెంచాలని, బయోమెట్రిక్ విధానం రద్దు చేసి ఉపాధి కూలి రూ.600కు పెంచాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచడంతో నిత్యావసరాల ధరలు అకాశాన్నంటుతున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్ అన్నారు. ఉపాధి కూలీలకు సక్రమంగా కూలి డబ్బులు అందక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పని ప్రదేశంలో ఉపాధి కూలీల సమస్యలపై ఆరా తీశారు. ఈ నెల 20, 21, 22 తేదీల్లో మహబూబ్‌నగర్‌లో జరిగే వ్యవసాయ కార్మిక సంఘం 4వ రాష్ట్ర మహాసభలకు జిల్లా నుంచి కార్మికులు అధికసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ నిరంజన్, కోదండరాములు, పార్టీ గ్రామ కార్యదర్శి వెంకటయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎం.వెంకటయ్య, రైతు సంఘం నాయకులు భాస్కర్, మల్లేష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


