కొత్తకోట రూరల్: పేదల సంక్షేమం, అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కొత్తకోటలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల్లో పాల్గొన్నారు. అంతకుముందు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులతో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పేదల సొంతింటి కలను సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికే దక్కుతుందన్నారు. గత పాలకులు పేదల సంక్షేమాన్ని విస్మరించగా.. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం అన్నివర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ కూడా సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్‌పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని ఆరోపించారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను పెద్దఎత్తున గెలిపించారని.. త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పి.అరుణ, వైస్ చైర్‌పర్సన్ పి.పల్లవి, మదనాపురం మార్కెట్ చైర్మన్ పి.ప్రశాంత్, మాజీ సర్పంచ్ శేఖర్‌రెడ్డి, పి.కృష్ణారెడ్డి, మేసీ్త్ర శ్రీను, కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు బీచుపల్లి యాదవ్, పట్టణ అధ్యక్షుడు పెంటన్న యాదవ్, నాయకులు డా. పీజే బాబు, ఎన్‌జే బోయేజ్, సంద వెంకటేష్, కౌన్సిలర్లు, కో–ఆప్షన్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పేదల కోసమే కాంగ్రెస్‌పార్టీ ఆవిర్భావం..
మదనాపురం: పేదల సంక్షేమం, వారి హక్కుల రక్షణ కోసమే కాంగ్రెస్‌పార్టీ ఆవిర్భవించిందని ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి వెల్లడించారు. శుక్రవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించిన రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలోని పేదలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి రాహుల్‌గాంధీ కృషి చేస్తున్నారని కొనియాడారు. వేడుకల్లో పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు తిరుపతిరెడ్డి, సర్పంచ్ శారద రామకృష్ణ, మార్కెట్ డైరెక్టర్ పావని, నాయకులు వెంకట నారాయణ, వేమన్న, రవీందర్‌రెడ్డి, కృష్ణవర్ధన్‌రెడ్డి, అంజాద్‌అలీ, హసన్ తదితరులు పాల్గొన్నారు.


