కొత్తకోట రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్‌కు దీటుగా నాణ్యమైన విద్య అందుతుందని ఇన్‌చార్జ్ జిల్లా విద్యాధికారి యాదయ్య అన్నారు. శుక్రవారం పెద్దమందడి మండలం మోజర్ల–మద్దిగట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా సెక్టోరియల్ అధికారి శేఖర్, మండల విద్యాధికారి మంజులత, గెజిటెడ్ హెచ్‌ఎం వరప్రసాదరావుతో కలిసి పాఠశాల ఆవరణలో ఉన్న సరస్వతి మాత విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి ఆవరణలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి మొక్క నాటి నీరు పోశారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పట్టికలు, కంప్యూటర్ గది, ప్రయోగశాలను సందర్శించి విద్యార్థులకు అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. భౌతిక, రసాయనశాస్త్ర విభాగాల్లో నిర్వహిస్తున్న ప్రయోగాలపై ఆరా తీశారు. విద్యార్థులకు పాఠ్య, రాత పుస్తకాలు పూర్తిస్థాయిలో అందాయా లేదా అని తెలుసుకున్నారు. అనంతరం కొత్తగా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు పాఠ్య, రాత పుస్తకాలు పంపిణీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. బడి తోటలో పండించిన కూరగాయలతోనే వంటలు తయారు చేస్తున్నట్లు కార్మికురాలు కృష్ణమ్మ వివరించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని సూచించారు. ఆయన వెంట మద్దిగట్ల, అమ్మపల్లి, మోజర్ల ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శివరాజ్, శశివర్ధన్, యుగంధర్, ఉపాధ్యాయులు ఉన్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న మాటను నిలబెట్టుకోవాలని టీజేఎంయూ రీజినల్ సెక్రటరీ నాగేందర్ అన్నారు. సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం మహబూబ్‌నగర్ బస్‌డిపో ఎదుట గేట్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుర్తింపు సంఘాల ఎన్నికలకు ముందే విలీనం ప్రక్రియ ఆరంభించాలన్నారు. ఇదే విషయమై ఈనెల 24 నుంచి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు నిరాహార దీక్షలు చేపట్టనున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంఘాలకు అతీతంగా ఆర్టీసీ కార్మికులందరూ హాజరై విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు రాములు, ఎన్.ఎం.రావు, శ్రీనివాస్, సురేష్ పాల్గొన్నారు.


