వనపర్తి: ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి మాదక ద్రవ్యాలను నిర్మూలించి యువతను సరైన మార్గంలో నడిపించాలని, అందరి సహకారంతో జిల్లాను మత్తురహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీస్‌శాఖ నిరంతరం కృషి చేస్తోందని ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ పోస్టర్లను ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. మాదక ద్రవ్యాలు వ్యక్తిగత జీవితాలను మాత్రమే కాకుండా కుటుంబాలు, సమాజం, దేశ భవిష్యత్‌ను కూడా తీవ్రంగా దెబ్బతీస్తాయన్నారు. ముఖ్యంగా యువత డ్రగ్స్ బారిన పడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, అన్నివర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘నషా ముక్త్ భారత్ అభియాన్‘ కార్యక్రమం ద్వారా మత్తు పదార్థాల వినియోగంతో కలిగే అనర్థాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీ, జిల్లా సంక్షేమశాఖ అధికారి కె.సుధారాణి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాంబాబు, జిల్లా సంక్షేమశాఖ సూపరింటెండెంట్ అరుంధతి, చైల్డ్ ప్రొటెక్షన్ డీసీపీయూ అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


