భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం | - | Sakshi
Sakshi News home page

భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం

Jun 18 2026 12:35 AM | Updated on Jun 18 2026 12:35 AM

వనపర్తి: భూ నిర్వాసితులు వాస్తవ పరిస్థితుల ఆధారంగా తమ విన్నపాలు తెలియజేయాలని.. వాటిని ప్రభుత్వానికి నివేదించి న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తామని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బుద్ధారం పెద్దచెరువు రిజర్వాయర్‌ భూ సేకరణ అంశంపై సంబంధిత గ్రామ రైతులతో కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లాస్థాయి చర్చల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రిజర్వాయర్‌ పరిధిలోని 101 ఎకరాల రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు భూ సేకరణ అంశానికి సంబంధించి తమ అభిప్రాయాలను అధికారుల ముందుంచారు. గ్రామానికి చెందిన 200కు పైగా చిన్న, సన్నకారు రైతులమే రిజర్వాయర్‌ నిర్మాణంలో భూములు కోల్పోతున్నామని.. కేవలం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నామని, ఉపాధి లేక రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఎకరాకు రూ.12.50 లక్షలు కాకుండా పెద్ద మొత్తంలో పరిహారం ఇవ్వాలని కోరారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లు, ఇతర ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూర్చాలన్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. బుద్ధారం పెద్ద చెరువు రిజర్వాయర్‌ నిర్మాణంలో భూములు కోల్పోనున్న రైతుల అభిప్రాయ సేకరణకే సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో మార్కెట్‌ రేట్లకు అనుగుణంగా ధరను నిర్ణయిస్తుందని.. రైతులు ఆమోదయోగ్యం కాని పరిహారాన్ని కోరడం సరైన విధానం కాదని సూచించారు. రైతులకు న్యాయం చేసేందుకే ప్రభుత్వం తరఫున తాము ఎప్పుడు ప్రయత్నిస్తామని తెలిపారు. అదేవిధంగా భూములు కోల్పోయే వారికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ప్రాధాన్యం ఇస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌, భూ సేకరణ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ తిరుపతయ్య, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, ఇతర రెవెన్యూ అధికారులు, సర్పంచ్‌ శేఖర్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement