కొత్తకోట రూరల్/మదనాపురం: రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని.. ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి కోరారు. ఆదివారం రాత్రి కొత్తకోట, మదనాపురం మండలం రామన్‌పాడ్‌లో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని కేంద్రాల్లో విక్రయిస్తే మద్దతు ధర లభించి లాభపడతారని.. దళారులను ఆశ్రయిస్తే నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. అలాగే కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కనీస సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని రైతుల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని వివరించారు. గత ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేయడంతోనే అధికారానికి దూరమైందని విమర్శించారు. అభివృద్ధికి సహకరించకుండా ప్రతిపక్ష నాయకులు అడ్డంకులు సృష్టిస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నిరంతరం అభివృద్ధికి కృషి చేస్తున్న తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. కొత్తకోటలో జరిగిన కార్యక్రమంలో పుర చైర్‌పర్సన్ పి.అరుణ, కాంగ్రెస్‌పార్టీ పట్టణ అధ్యక్షుడు మేస్త్రి శ్రీనివాసులు, కౌన్సిలర్లు ఎన్‌జే బోయేజ్, అబ్దుల్ నబీ, చంద్రకాంత్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, ఎల్లంపల్లి నరేందర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, సుభాష్, ముజీబ్, చీర్ల యాదయ్యసాగర్, రామన్‌పాడులో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ అఫ్రీన్‌బేగం అంజాద్‌అలీ, మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్, మండల కో–ఆర్డినేటర్ చుక్క మహేష్, వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, కురుమూర్తిరాయ ఎత్తిపోతల పథకం చైర్మన్ రాజవర్దన్‌రెడ్డి, నాయకులు శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి


