కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి
● రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి
గోపాల్‌పేట: ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చి.. అనేక పథకాలు అమలు చేస్తోందని.. ప్రజలకు ఇంకా ఏ పథకాలు అమలుచేస్తే బాగుంటుందో తెలుసుకునేందుకే ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా.చిన్నారెడ్డి అన్నారు. గురువారం గోపాల్‌పేట తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఎంపీఓ భవాణి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా 99 రోజుల ప్రణాళికను అమలుచేస్తున్నట్లు తెలిపారు. గతంలో మాదిరిగా సెంట్రల్ ఫండ్, స్టేట్ ఫండ్ రావడం లేదని.. ప్రస్తుతం నేరుగా గ్రామ పంచాయతీల్లోనే నిధులు జమ అవుతున్నాయన్నారు. సర్పంచులు నిజాయతీగా పనిచేసి.. గ్రామాలను అన్నివిధాలా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ఇంకా అభివృద్ధి పనులకు నిధులు అవసరమైతే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. జూరాల సమీపంలోని పంటపొలాలకు సాగునీరు లేక పంటలు ఎండిపోతుండటంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో పట్టుబట్టి కేఎల్‌ఐ కాల్వలు తవ్వించినట్లు చెప్పారు. కేఎల్‌ఐ నీటి రాకతో రైతులు రెండు పంటలు పండిస్తున్నారన్నారు. రెండో పంటకు సాగునీటి ఇబ్బందులు ఏమైనా ఉంటే సంబంధిత అధికారులు ముందస్తుగా రైతులకు తెలియజేయాలని సూచించారు. అంతకుముందు కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం చేపడుతున్న అరైవ్.. అలైవ్ కార్యక్రమంపై అందరికీ అవగాహన ఉండాలన్నారు. గతంలో తాను పనిచేసిన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ రాజకీయ నాయకుడు మరణించాడని గుర్తుచేశారు. వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. అనంతరం డీటీఓ మానస ప్రతిజ్ఞ చేయించారు. ఉమ్మడి మండలంలో మొదటిసారిగా బెల్టుషాపులను బంద్ చేయించిన పొలికెపాడు సర్పంచ్ నక్కా బంగారయ్యను అభినందించి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, మండల అధికారులు పాల్గొన్నారు.
వనపర్తి: యాసంగి సీజన్ వరిధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం అదనపు కలెక్టర్ వినోద్ కుమార్‌తో కలిసి కలెక్టర్ చాంబర్‌లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో వరిపంట కోత దశకు చేరుకుందని, రైతులు పంట కోసిన వెంటనే కొనుగోలు ప్రక్రియ ప్రారంభించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సీజన్‌లో దాదాపు 3.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రానున్నట్లు అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. ముందుగా కోతకు వచ్చే మండలాల్లో ఐకేపీ, పీఏసీఎస్ ద్వారా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి.. తూకం కాంటాలు, తేమ యంత్రాలు, గన్నీ బ్యాగులు, టార్పాలిన్ కవర్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. అదే విధంగా వరిధాన్యం అమ్మడానికి వచ్చే రైతులకు కేంద్రాల్లో తాగునీరు, నీడ సౌకర్యం కల్పించాలన్నారు. సన్న రకం, దొడ్డు రకం ధాన్యానికి వేరువేరుగా కేంద్రాలను ఏర్పాటుచేయాలని సూచించారు. కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే ట్యాబ్ ఎంట్రీలు వేగంగా చేసే విధంగా నిర్వాహకులకు సూచనలు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఏమైనా అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఇక ధాన్యాన్ని నిల్వ చేయడానికి గోదాములను సిద్ధం చేయాలని మార్కెటింగ్ అధికారికి సూచించారు. మిల్లర్లకు సంబంధించి వరిధాన్యం కేటాయింపులు కచ్చితంగా బ్యాంకు గ్యారంటీలు సమర్పించిన వారికి మాత్రమే ధాన్యం కేటాయించాలన్నారు. సమావేశంలో డీఆర్డీఓ ఉమాదేవి, డీసీఎస్‌ఓ కాశీ విశ్వనాథ్, డీసీఓ రాణి ఉన్నారు.


