బాలికలను అన్నిరంగాల్లో తీర్చిదిద్దాలి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: బాలికలను అన్నిరంగాల్లో తీర్చిదిద్దాలని హైదరాబాద్ ప్రాంతీయ విద్యా సంచాలకులు ఎం.సోమిరెడ్డి అన్నారు. జాతీయ విద్యా ప్రణాళిక, పరిపాలన సంస్థ (ఎన్‌ఐఈపీఏ– నీపా) ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాలకు చెందిన కేజీబీవీల ప్రత్యేకాధికారులకు సాధికారతపై నిర్వహించిన ఐదు రోజుల శిక్షణ తరగతులు ఆదివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల అభ్యున్నతికి నాణ్యమైన విద్యతోపాటు జీవన నైపుణ్యాలు, క్రీడలు, కళలు, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. తల్లిదండ్రుల వద్ద కంటే విద్యార్థి నులు ఎక్కువ సమయం ఉపాధ్యాయులు, వార్డెన్లతోనే గడుపుతారని వారి భవిష్యత్ కేజీబీవీల ప్రత్యేకాధికారులు, ఉపాధ్యాయులపైనే ఆధారపడి ఉంటుందన్నారు. విద్యార్థినులకు ఉత్తమ విద్య, అవసరమైన సౌకర్యాలు కల్పించడమే గాక సత్ప్రవర్తనతో ఆదర్శంగా మెలగాలన్నారు. ఇక్కడ నేర్చుకున్న అంశాలను కేజీబీవీలలో తప్పక అమలు చేయాలని సూచించారు.


