గ్రామాల అభివృద్ధికి కృషి
గోపాల్‌పేట: సర్పంచులు, వార్డు సభ్యులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరారు. ఆదివారం పల్లెబాటలో భాగంగా మండలంలోని మున్ననూరులో ఆయన పర్యటించి గ్రామస్లుతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. పార్టీలకతీతంగా తాము పనిచేస్తున్నామని.. అందుకు నిదర్శనం ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపేనన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని తెలిపారు. గ్రామాభివృద్ధికి రూ.కోటి మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామపంచాయతీ కార్యాలయానికి పక్కా భవనం, పల్లె దవాఖాన, సీసీ రోడ్ల నిర్మాణం, గ్రామం నుంచి ఏదుట్ల, కాశీంనగర్ వెళ్లే రహదారి నిర్మాణం, శివాలయంలో కల్యాణ మండపం నిర్మించడంతో పాటు బస్సు సౌకర్యం కల్పనకు కృషి చేస్తానని వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ మమత, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు స్వరూప, ఉమ్మడి మండల ఇన్‌చార్జ్ సత్యశిలారెడ్డి, గ్రామ అధ్యక్షుడు ధీరమల్లు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.
వీధిదీపాలు ప్రారంభం..
వనపర్తి టౌన్: జిల్లాకేంద్రంలో ఆదివారం రూ.60 లక్షలతో ఏర్పాటు చేసిన వీధిదీపాలను ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పట్టణ అభివృద్ధికిగాను రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లలో రూ.807 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. ఇటీవల ప్రత్యేక అభివృద్ధి నిధులు రూ.2.50 కోట్లు విడుదల కావడంతో అధునాతన వీధిదీపాలకు రూ.60 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. పట్టణాన్ని రాష్ట్రంలోనే నంబర్ 1గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా డీసీసీ కార్యాలయంలో లాల్ బహద్దూర్‌శాస్త్రి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతకుముందు జిల్లాకేంద్రంలోని నాగవరం మైసమ్మ, భూలక్ష్మీ మాత ఆలయాల్లో పూజలు చేశారు. కార్యక్రమంలో డీఈ, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఏఈ, పుర మాజీ కౌన్సిలర్లు, మార్కెట్‌యార్డ్ డైరెక్టర్లు, కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


