పెదపెంకి గ్రామంలో సమస్యలపై మహిళలు రోడ్డెక్కారు. గ్రామంలోని కూరాకుల వీధి, కాపువీధికి చెందిన మహిళలు వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పెదపెంకి బస్టాండ్ వద్ద బుధవారం నిరసన తెలిపారు. వీధి కాలువలు వేస్తామని గుమ్ములు పెట్టి వదిలేశారు. తాగునీరు అందుబాటులో లేక అవస్థలు పడుతున్నాం. గుమ్ముల్లో వృద్ధులు పడిపోతున్నారు. కాలువ గుమ్ముల్లో నీరు నిల్వ ఉండి దుర్గంధంగా మారుతోంది. దోమల బెడద ఎక్కువగా ఉండి జ్వరాలు సోకుతున్నాయి. వెంటనే సమస్యలను పరిష్కరించాలని మహిళలు డిమాండ్ చేశారు. గ్రామాన్ని ఎప్పుడు బాగుచేస్తారో తెలియదు కానీ గడిచిన 4నెలల నుంచి ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. కాలువల నిర్మాణాలు జరుపుతామని జేసీబీలతో గుమ్ములు తీసి వదిలివేయడం దారుణంగా ఉందని మహిళలు ఆగ్రహించారు. కార్యక్రమంలో నేతాజీ గ్రంథాలయ వ్యవస్థాపకుడు సంజీవనాయుడు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.


