శృంగవరపుకోట:
ఒకరి తర్వాత ఒకరు... ఇలా బుధవారం ఉదయం నుంచి సాయంత్రమయ్యేసరికి ఎస్.కోట మండలంలోని తాటిపూడి బాలికల గురుకుల కళాశాలకు చెందిన 51 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. జ్వరాలతో వణికిపోయారు. కళ్లు మంటలు, కాళ్ల పీకులతో కదలలేక మంచం పట్టారు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు కలతచెందారు. కొందరు విద్యార్థినుల తల్లిదండ్రులు గురుకులానికి చేరుకుని సపర్యలు చేశారు. జ్వరాల వ్యాప్తి ఉద్ధృతం కావడంతో కళాశాల సిబ్బంది కొట్టాం పీహెచ్‌సీ సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి బాలికల హాస్టల్‌లోనే వైద్యసేవలు అందించినా తగ్గుముఖం పట్టకపోవడంతో, మరింత మంది వైద్యులను రప్పించారు. సాయంత్రం వరకు సేవలు కొనసాగించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న ఏడుగురు విద్యార్థినులను ఆటోలో ఎస్.కోట ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. 44 మందికి కళాశాల హాస్టల్‌లోనే వైద్యసేవలు అందిస్తున్నట్టు పీహెచ్‌సీ డాక్టర్ హారిక తెలిపారు.
కారణం ఏమిటో...
జ్వరాల వ్యాప్తికి స్పష్టమైన కారణం నిర్ధారణకాలేదు. కళాశాలలో చదువుతున్న 200 మంది విద్యార్థినుల్లో 51 మంది ఒకేసారి జ్వరం, ఒళ్లునొప్పులు, కళ్లు మంటలతో అస్వస్థతకు గురికావడం వైద్యులను సైతం విస్మయపరుస్తోంది. వైరల్ జ్వరాలుగా భావించి వైద్యసేవలు అందిస్తున్నామని, వైద్యపరీక్షల్లో స్పష్టమైన కారణం తెలుస్తుందని కొట్టాం పీహెచ్‌సీ డాక్టర్ హారిక చెప్పారు. ఎవరికీ మలేరియాగా నిర్ధారణ కాలేదని, 14 మంది మినహా మిగిలిన వారి ఆరోగ్యం కుదుటుపడిందన్నారు. కొందరు విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నట్టు గుర్తించి వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. కొట్టాం పీహెచ్‌సీ సిబ్బంది వచ్చి వైద్యసేవలు అందించాక మాలో ఆందోళన తగ్గిందని, విద్యార్థునులు కోలుకుంటున్నారని ప్రిన్సిపాల్ శారదాబాయి తెలిపారు.
తాటిపూడి గురుకులంలో 51 మంది విద్యార్థులకు అస్వస్థత
ఒకరితర్వాత ఒకరుగా మంచం పట్టిన బాలికలు
జ్వరాలతో వణుకుతున్న వైనం
ఏడుగురిని ఆటోలో ఎస్.కోట తరలింపు
అవసరానికి అందుబాటులో లేని
అంబులెన్స్‌లు
అవసరానికి రాని అంబులెన్స్...
జ్వరాలతో వణుకుతున్న గురుకుల విద్యార్థినులను ఎస్.కోట ఏరియా ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్‌లు లేకపోవడం ఆందోళనకు గురిచేసింది. విద్యార్థినులు దుప్పట్లు కప్పుకుని సాయంత్రం వరకు ఆటో కోసం నిరీక్షించారు. ఎట్టకేలకు కళాశాల సిబ్బంది ఆటోను రప్పించి వారిని ఎస్.కోట పంపారు. గత ప్రభుత్వ హయాంలో పరుగులు తీసిన అంబులెన్స్‌లు ఇప్పుడు అవసరానికి రాని ఆపద్బంధువులుగా మారాయంటూ విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు.


