విజయనగరం రూరల్: కోరుకొండ సైనిక పాఠశాలకు ఐఎన్‌ఎస్ దునాగిరి యుద్ధనౌక నమూనాను ఐఎన్‌ఎస్ దునాగిరి కమాండింగ్ అధికారి, కెప్టెన్ దివ్య అలోక్ బహూకరించారు. కోరుకొండ సైనిక పాఠశాలను బుధవారం సందర్శించిన అలోక్‌కు సైనిక పాఠశాల పిన్సిపాల్, కెప్టెన్ ఎస్‌ఎస్ శాస్త్రి, అధికారులు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పాఠశాలలో కాన్ఫరెన్స్ హాల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక స్మార్ట్ ప్యానల్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ప్యాలెస్ హాల్‌లో భారత నౌకాదళ సంప్రదాయ, సైనిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే ఐఎన్‌ఎస్ దునాగిరి నౌక నమూనాను ఈస్టర్న్ ఫ్లీట్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్, రియర్ అడ్మిరల్ అలోక్ ఆనంద్ తరఫున పాఠశాలకు అందజేశారు. ఈ సందర్భంగా పీవీజీ రాజు ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి దేశ రక్షణ రంగంలో చేరి దేశానికి సేవ చేయాలన్నారు. విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలన్నారు. నౌకాదళ, దేశభక్తి అంశాలపై తన అభిప్రాయాలను విద్యార్థులతో పంచుకున్నారు. ఎన్‌డీఏలో చేరేందుకు పాఠశాల చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్, వింగ్ కమాండర్ వి.కిరణ్, పరిపాలన అధికారి, స్క్వాడ్రన్ లీడర్ అతుల్‌జాన్ థామస్, తదితరులు పాల్గొన్నారు.
బ్రెయిన్‌స్ట్రోక్‌తో
ఉపాధ్యాయురాలి మృతి
రేగిడి: మండల పరిధిలోని లచ్చన్నవలస ప్రాథమిక పాఠశాలలో ఎస్‌జీటీగా విధులు నిర్వహిస్తున్న మంతిన హేమలత బ్రెయిన్ స్ట్రోక్‌తో బుధవా రం మృతిచెందినట్లు ఎంఈఓ ఎంవీ ప్రసాదరావు విలేకరులకు తెలిపారు. ఈ నెల 24న పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ సమావేశం నిర్వహించిన సమయంలో ఆమె అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారన్నారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా మెదడులో రక్తనాళాలు దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారని, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతిచెందారన్నారు. ఆమె మృతిపై లచ్చన్నవలస గ్రామస్తులతోపాటు ఎంఈఓ ఎరకయ్య, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సంతాపం తెలిపారు.


