● ఏపీ చెరకు రైతు సంఘం వినతిపత్రం
రేగిడి: ఈ ఏడాది రైతులు కొత్తగా వేసిన చెరకు మొక్కతోటకు అగ్రిమెంట్ చేయాలని ఏపీ చెరకురైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు సంకిలి ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారం జనరల్ మేనేజర్ వెంకటసూర్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ 2026–27 చెరకు క్రషింగ్ సీజన్‌కు టన్నుకు రూ.4వేలు అందజేయాలన్నారు. గతంలో మాది రిగా చెరకు రైతులకు రాయితీలు ఇచ్చి సాగువిస్తీర్ణాన్ని పెంచాలని కోరారు. చెరకు రైతులకు యాజమాన్యం ఇస్తున్న మద్దతు ధర ఏ మాత్రం సరిపోవడంలేదన్నారు. పంట పెట్టుబడికి, రైతుకు అందే మద్దతు ధర మధ్య చాలా వ్యత్యాసం ఉండడంతో చెరకు పంట సాగుచేయడం రైతులకు భారంగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెరకు సాగుచేస్తున్న రైతులకు టన్నుకు రూ.వెయ్యి ప్రోత్సాహక మద్దతు ధర ఇచ్చి ఇటు రైతులను, అటు చక్కెర కర్మాగారాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ విషయంపై జీఎం మాట్లాడుతూ రైతులు లిఖితపూర్వకంగా అందించిన డిమాండ్లను యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్తామని వెల్లడించారు. సమావేశంలో రైతులు గేదెల సత్యం, తాడేల తవిటినాయుడు, యర్రాపాత్రుని సూర్యనారాయణ, రుంకు భుజంగరావు, కిమిడి మాధవరావు, తదితరులు పాల్గొన్నారు.


