రామభద్రపురం: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను పూర్తిచేసిన కేంద్ర ఎన్నికల సంఘం అందులో భాగంగా 17 ఏళ్లకే కొత్త ఓటరుగా నమోదు ప్రక్రియను ప్రారంభించింది. ప్రస్తుతం 18 ఏళ్లు నిండి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ కొత్తగా ఓటు హక్కు పొందేందుకు అవకాశం కల్పించింది. ఇటీవల సర్ ప్రక్రియలో ఓటు కనిపించని వారు కూడా అర్హత ఉండి ఉంటే కొత్తగా దరఖాస్తు చేసుకుని ఓటు హక్కు పొందవచ్చు. యువత భాగస్వామ్యాన్ని మరింత పెంచడమే లక్ష్యంగా మరో చాతరిత్రాత్మక నిర్ణయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంది. ఇకపై 17 ఏళ్లు నిండిన యువతీ యువకులు ముందస్తుగానే ఓటరు జాబితాలో పేరు నమోదుకు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అయితే యువత ముందస్తు దరఖాస్తు చేసుకున్నప్పటికీ వారికి 18 ఏళ్లు పూర్తిగా నిండిన తర్వాతే తుది ఓటరు జాబితాలో పేరు నమోదు కావడంతో పాటు ఓటు హక్కు లభిస్తుంది.
దరఖాస్తు చేసుకోవడానికి ఉండాల్సిన ధ్రువీకరణపత్రాలు..
17 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటరుగా నమోదు చేసుకోవడానికి తమ వయస్సు, నివాస ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు సమర్పించాల్సి ఉంటుంది. అలాగే తల్లిదండ్రుల ఓటరు ఐడీ కూడా ఉండాలి. ఈ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో బీఎల్‌ఓలు పరిశీలిస్తారు. వారు ధ్రువీకరణ పత్రాలను వ్యక్తిగతంగా పరిశీలించిన తర్వాత అర్హులా కాదా అని తేల్చి ఓటు హక్కు ఇవ్వాలా లేదా అనేది నిర్ణయిస్తారు. దరఖాస్తు ప్రక్రియ 17 ఏళ్లకే ప్రారంభమైనప్పటికీ సదరు యువతకు 18 ఏళ్లు నిండిన తర్వాతనే వారి పేర్లు తుది జాబితాలో ప్రచురితమవుతాయి.ఈ సరికొత్త విధానంపై అవగాహన కల్పించడానికి ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలతో పాటు డిగ్రీ కళాశాలలో ప్రత్యేక నమోదు శిబిరాలను నిర్వహించేందుకు సంబంధిత అధికారులు కసరత్తు చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న ఈ సలభతరమైన ముందస్తు దరఖాస్తు ప్రక్రియ వల్ల వేలాదిమంది యువతకు సరికొత్త ఓటరుగా మారే అవకాశం లభించనుంది. విద్యాసంస్థల గణాంకాల ప్రకారం 2023–24 విద్యాసంవత్సరంలో పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలు రాసే సమయానికి 15 ఏళ్లు నిండిన విద్యార్థుల వయస్సు 2026 నాటికి 17 ఏళ్లకు చేరుకుంటుంది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం, డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న వేలాది మంది విద్యార్థులకు ఇప్పుడు 17 నుంచి 18 ఏళ్లు నిండుతున్నాయి. వారు చేసుకునే ముందస్తు దరఖాస్తు ప్రక్రియ వల్ల ఓటర్ల సంఖ్య పెరిగే అవకాం కనిపిస్తోంది.
ముందస్తుగా దరఖాస్తుల ఆహ్వానం
ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వెంటనే ఓటుహక్కు
జాబితాలో చేరనున్న కొత్త ఓటర్లు
కళాశాలల్లో ప్రత్యేక శిబిరాల ఏర్పాటుకు కసరత్తు
వేలాదిమంది యువతకు దక్కనున్న అవకాశం


