● ఎస్పీ ఏఆర్ దామోదర్
పూసపాటిరేగ: దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 1న జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఎస్పీ ఏఆర్ దామోదర్ మంగళవారం ఆదేశించారు. దేశ ప్రధాని జిల్లాలోని భోగాపురంలో పర్యటించనున్న నేపథ్యంలో ఎస్పీ ఏఆర్ దామోదర్, ఆక్టోపస్, గ్రేహౌండ్స్ ఐజీ కె.శ్రీకాంత్, విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి, గ్రేహౌండ్స్ డీఐజీ అట్టాడ బాపూజీ, గ్రేహౌండ్స్ ఎస్పీ డా.సుమిత్ గరుడ్‌తో కలిసి ఎయిర్ పోర్ట్‌కు వెళ్లే రహదారులను, పార్కింగ్ స్థలాలు, మీటింగ్ స్థలం, కమాండ్ కంట్రోల్, ఎయిర్ పోర్ట్ మార్గానికి అనుసంధానం చేస్తున్న ట్రంపెట్ లను సందర్శించి, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ప్రధాని పర్యటనలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా జాతీయ రహదారిని ఎయిర్ పోర్ట్ రహదారికి అనుసంధానం చేసే పనులను వేగవంతం చేయాలన్నారు. ప్రధాని పర్యటనలో పాల్గొనేందుకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల నుంచి సుమారు 5వేల బస్సులు, ముఖ్య వ్యక్తులు, ప్రముఖులకు సంబంధించి మరో 5వేల కార్లు, ఇతర వాహనాలు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా పని చేయాలని చెప్పారు. జాతీయ రహదారిని ఎయిర్ పోర్ట్ రహదారికి అనుసంధానం చేసే ప్రాంతాల వద్ద పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. వీఐపీ వాహనాలు సన్ రే రిసార్ట్ మీదుగా ఎయిర్ పోర్ట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలానికి చేరుకునే విధంగా చర్యలు చేపడుతున్నామని ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు.


