విలేజ్‌ హెల్త్‌క్లినిక్స్‌లో జరగని డెంగీ పరీక్ష..! | - | Sakshi
Sakshi News home page

విలేజ్‌ హెల్త్‌క్లినిక్స్‌లో జరగని డెంగీ పరీక్ష..!

Jul 29 2026 2:10 AM | Updated on Jul 29 2026 2:10 AM

కానరాని టెస్టింగ్‌ కిట్లు

పరీక్ష కోసం పీహెచ్‌సీకి వెళ్లాల్సిన పరిస్థితి

విజయనగరం ఫోర్ట్‌: ప్రజారోగ్యాన్ని టీడీపీ సర్కార్‌ గాలికివదిలేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా గ్రామీణ ప్రాంత ప్రజలు వైద్యసేవల కోసం అవస్థలు పడుతున్నారు. గ్రామీణుల చెంతనే అందాల్సిన వైద్య సేవలు అందకపోవడం వల్ల వారు పీహెచ్‌సీలకు వెళ్లాల్సిన దుస్థితి. ప్రస్తుతం సీజనల్‌ వ్యాధులైన మలేరియా, డెంగీ, వైరల్‌ జ్వరాల వ్యాప్తి అధికంగా ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యాధుల వ్యాప్తి అధికంగా ఉంది. వ్యాధి నిర్ధారణ త్వరగా చేయగలిగితే చికిత్స అందించి ప్రాణపాయం బారిన పడకుండా కాపాడడానికి అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో చేసే డెంగీ పరీక్షలు నిలిచిపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు.

గ్రామాల్లో కిట్ల కొరత

జిల్లాలో482 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు ఉన్నాయి. వాటి పరిధిలో జ్వరం బారిన పడిన వారికి మలేరియా, డెంగీ పరీక్షలు చేయడానికి మలేరియా, డెంగీ టెస్టింగ్‌ కిట్లు ప్రభుత్వం సరఫరా చేయాలి. అయితే డెంగీ టెస్టింగ్‌ కిట్లు చాలా చోట్ల లేనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో జ్వరపీడితులకు మలేరియా టెస్టు మాత్రమే వైద్యసిబ్బంది చేస్తున్నారు. మలేరియా కంటే డెంగీ ప్రమాదకరమైనది. డెంగీ వ్యాధిని త్వరగా గుర్తించాల్సి ఉంటుంది. డెంగీ వ్యాధిని సకాలంలో గుర్తించకపోతే వ్యాధి తీవ్రమై ప్రాణాలమీదకు వస్తుంది.

పీహెచ్‌సీకి వెళ్లాల్సిన పరిస్థితి

విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌లో డెంగీ కిట్ల కొరత వల్ల జ్వరపీడితులు డెంగీ టెస్టు కోసం పీహెచ్‌సీలకు వెళ్లాల్సిన పరిస్థితి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లోనే మలేరియా, డెంగీ కిట్లు అందుబాటులో ఉంచేవారు. ఇంటింటా సర్వే నిర్వహించి జ్వరపీడితులు ఉంటే వారికి అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ అయిన వారికి చికిత్స కోసం రిఫరల్‌ ఆస్పత్రికి పంపించేవారు. దీని వల్ల వారికి త్వరగా చికిత్స అందడం వల్ల త్వరగా కోలుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేక పోవడం వల్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

విచారణ చేసి చర్యలు

విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌లో డెంగీ కిట్ల కొరత విషయం తెలియదు. విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. పీహెచ్‌సీల్లో నుంచి విలేజ్‌హెల్త్‌ క్లినిక్‌లకు కిట్లు అందిస్తారు.

– డాక్టర్‌ ఎస్‌. జీవనరాణి, డీఎంహెచ్‌ఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement