రాజాం సిటీ: బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న మరో రౌడీ షీటర్‌ను రాజాం పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను స్థానిక టౌన్ సర్కిల్ కార్యాలయంలో సీఐ డి.నవీన్‌కుమార్ సోమవారం వెల్లడించారు. ఈ నెల 25న మధ్యాహ్నం కంచరాం గ్రామానికి చెందిన ఎల్.రవిమోహన్ అతని స్నేహితుడు రామసుందరంతో కలిసి బొబ్బిలి రోడ్డులోని ఫైర్‌స్టేషన్ వెనుక తోటలో మద్యం తాగుతున్నాడు. ఆ సమయంలో రౌడీ షీటర్ అయిన సిరిపురపు దేవరాజు అక్కడికి చేరుకున్నాడు. మద్యం తాగుతున్న రవిమోహన్, రామసుందరంలపై దాడిచేయడంతోపాటు డబ్బు, ఫోన్ ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించి రూ.వెయ్యితోపాటు ఫోన్ బలవంతంగా తీసుకున్నాడు. ఈ దాడిలో గాయపడిన రవిమోహన్ రాజాం ప్రాంతీయ ఆస్పత్రిలో చికిత్సనిమిత్తం చేరాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై మహ్మద్ సల్మాన్ బేగ్ కేసు నమోదుచేసి దర్యాప్తు నిర్వహించి దేవరాజును సోమవారం అరెస్టు చేసి కోర్టుకు తరలించగా 14 రోజులు రిమాండ్ విధించారు.


