విజయనగరం ఫోర్ట్: ఎరువుల సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం స్థానిక కలెక్టరేట్ నుంచి వ్యవసాయ శాఖాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి విడత ఎరువులు తీసుకోని రైతులు ఎరువులు తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లోని రైతులు ఇప్పటికే రెండో విడత ఎరువులు తీసుకుంటున్నారని తెలిపారు. రెండు విడతల ఎరువుల వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయాలని సూచించారు. జిల్లాలో మొదట విడతకు 12,259 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, 11,653 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేసినట్లు చెప్పారు. ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో, ఎరువులు తీసుకోవడానికి రైతులు ఆసక్తి చూపడం లేదని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. మండలాల వారీగా పరిస్థితులను అంచనా వేసి ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు సలహాలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు.
కలెక్టర్ రాంసుందర్ రెడ్డి


