● ఎస్పీ ఏఆర్ దామోదర్
గంట్యాడ: ఆగస్టు 1న ప్రధాని నరేంద్రమోదీ జిల్లా పర్యటన నేపథ్యంలో విజయనగరం పట్టణం, రూరల్, భోగాపురం, భోగాపురం సర్కిల్ పరిధిలో పక్కాగా వాహన తనిఖీలు చేపట్టాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఆయన మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్‌పోర్టుకు వెళ్లే మార్గాల్లో తాత్కాలిక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలన్నారు. ఎయిర్‌పోర్టు పరిసర గ్రామాల్లో కూంబింగ్, ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. ప్రధాని పర్యటన ముగిసే వరకు భద్రతా చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
పెంట జెడ్పీహెచ్‌ఎస్
విద్యార్థులకు అవార్డులు
బొబ్బిలిరూరల్: రాష్ట్ర అటవీశాఖ కాకినాడలో నిర్వహించిన స్పారో హీరో జాతీయస్థాయి కథా రచనల పోటీల్లో పెంట జెడ్పీహెచ్ స్కూల్ విద్యార్థులు రాణించారు. ఎం. జయశ్రీ సీనియ ర్ విభాగంలో మొదటి స్థానం సాధించగా, రెండో స్థానాన్ని శ్రీలాస్య సాధించింది. అలాగే జూనియర్ విభాగంలో ఎన్. ప్రణీతకు మూడో స్థానం, డ్రాయింగ్ జూనియర్ విభాగంలో జి. అశ్విన్‌కుమార్‌కు నాలుగో స్థానం లభించింది. కాకినాడ సమీపంలోని కోరంగి అభయారణ్యం వద్ద ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో అటవీశాఖ ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే విజేతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం మోహనరావు విద్యార్థులతో గైడ్ టీచర్లు కె సింహాచలం, ఎం శ్రీనివాసరావులను అభినందించారు.
భట్రాజుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సతీష్‌రాజు
విజయనగరం గంటస్తంభం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భట్రాజుల సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం విజయవాడలో నిర్వహించారు. ఈ సమావేశంలో విజయనగరం జిల్లాకు చెందిన సీహెచ్‌సీఎస్‌వీ రాజు (సతీష్‌రాజు)ను సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు ఆయన్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో భట్రాజుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు చక్రాల పక్కిరాజు, ఏపీ రాష్ట్ర భట్రాజుల కార్పొరేషన్ చైర్మన్ సరికొండ వెంకటేశ్వరరాజు, విజయనగరం జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు.
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
సీతానగరం: తీవ్ర మనస్తాపానికి గురై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని అంటిపేటలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలియజేసిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చుక్క త్రినాథ్ (75) భార్యర తొమ్మిది నెలల కిందట మృతి చెందింది. ఇతనికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారులు వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. కుమార్తెకు కూడా వివాహం జరిగిపోవడంతో కొన్నాళ్లుగా ఒంటరిగా ఉంటున్నాడు. దీంతో ఒంటరితనాన్ని జీర్ణించుకోలేక కొన్నాళ్లుగా ముభావంగా ఉంటున్నాడు. ఈక్రమంలో ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెచ్‌సీ కమలాకర్ గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బొబ్బిలి సీహెచ్‌సీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


