రాజాం సిటీ: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఏపీటీఎఫ్ ముందడుగు వేస్తోందని ఆ శాఖ రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల అన్నారు. ఆదివారం స్థానిక సన్‌స్కూల్ ఆవరణలో ‘రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 – ఉపాధ్యాయుల విభజన’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విభజనపై ఉపాధ్యాయులు లేవనెత్తుతున్న అంశాలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఉమ్మడి రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు కె.వేణుగోపాల్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యోగుల విభజనలో జరిగిన లోపాలు ఆంధ్రప్రదేశ్‌లో పునరావృతం కాకుండా ఏపీటీఎఫ్ చూడాలని సూచించారు. ఉపాధ్యాయుల విభజనకు సంబంధించి అనేక సందేహాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేసుకునేందుకు ఈ అవగాహనా సదస్సు ఏర్పాటు చేశామని జిల్లా అధ్యక్షుడు మజ్జి మదన్‌మోహన్ తెలిపారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ ప్రతినిధులు సరస్వతి, బాలకృష్ణ, వెంకటపతిరాజు, జోగినాయుడు, పాల్తేరు శ్రీనివాస్, తిరుమలరావు, చావలి శ్రీనివాస్, బుఖారి బాబు, అచ్యుతకుమార్, ఆర్.అప్పలనాయుడు, లంక రామకృష్ణ, సీతంనాయుడు, భాస్కరరావు, శివరావు, మహేష్, తదితరులతో పాటు మూడు జిల్లాల నుంచి 500 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


