విజయనగరం అర్బన్:
ఉత్తరాంధ్రలోని ఐదు జిల్లాలు... పొరుగున ఉన్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల విమాన ప్రయాణికులకు, ఈ ప్రాంత ఉత్పత్తుల ఎగుమతులకు ఆధారంగా నిలవనున్న భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమైంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రత్యేక చొరవతో ప్రారంభమైన పనులు మూడేళ్లలో పూర్తయ్యాయి. జీఎంఆర్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మాణ బాధ్యతలు తీసుకుని పనులు పూర్తి చేసింది. ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. అయితే, విమానాశ్రయానికి రాకపోకలు సాగించేందుకు ఆధారమైన కనెక్టెవిటీ రోడ్ల నిర్మాణంలో కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది. రెండేళ్లలో ఒక్క రోడ్డునూ పూర్తిచేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విమానాశ్రయం ఊరిస్తున్నా అక్కడకు చేరుకునేందుకు ప్రయాణ కష్టాలు తప్పవని ప్రయాణికులు చెబుతున్నారు. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల నుంచి నేరుగా విమానాశ్రయానికి చేరుకునేందుకు ఇప్పటికీ ఇరుకురోడ్లే దర్శనమిస్తుండడంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. విమానాశ్రయాన్ని బయట ప్రపంచంతో అనుసంధానించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్న వాదన వినిపిస్తోంది. వేల కోట్ల రూపాయలు కుమ్మరిస్తూ అమరాతిలో నీళ్లు తోడడానికి చూపిన శ్రద్ధలో ఒకశాతం చూపించి ఉంటే ఈ పరిస్థతి ఉండేది కాదని, గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వమే ఇప్పుడు అధికారంలో ఉండిఉంటే రోడ్లను సైతం ముస్తాబుచేసి ఉండేదన్న వ్యాఖ్యలు వినిపిస్తు న్నాయి. విమానాశ్రయం చుట్టూ రవాణా నెట్ వర్క్, మౌలిక వసతుల కల్పనను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేయంతో ‘రంగుల కల...రోడ్డున పడింది’ అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
● ‘లాజిస్టిక్ పవర్’కి పక్షవాతం!
భోగాపురం నుంచి అంతర్జాతీయ స్థాయి కార్గో సేవలు అందించి, ఈ ప్రాంత ఫార్మా, సీఫుడ్, వ్యవసాయ ఉత్తత్పులను విదేశాలకు ఎగుమతి చేయాలన్నది ప్రధాన లక్ష్యం. కానీ విమానాశ్రయం చుట్టూ లాజిస్టిక్స్ రవాణాకు అనుకూలమైన మౌలిక వసతులు, భారీ ట్రక్కుల రాకపోకలకు తగ్గ రహదారులు కల్పించకపోవడంతో ఆశలన్నీ అడియాసలయ్యే ప్రమాదం ఉంది. విమానం ల్యాండ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది కానీ, ఆ విమానం దాకా చేరుకోవడానికి రోడ్డు లేకపోవడం కూటమి పాలనలోని ప్రణాళికా రాహిత్యానికి పరాకాష్ట. సరిహద్దు రాష్ట్రాల అనుసంధానం మాటలా ఉంచితే కనీసం మూడు జిల్లాల అనుసంధానం కూడా విస్మరించడం వల్ల ఈ ప్రాంతం ఆర్థిక వికాసానికి పెద్ద గండి పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
● ప్రచార ఆర్బాటానికే పరిమితం..
ప్రధాని చేతుల మీదుగా ప్రారంభోత్సవం అని పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్న పచ్చనాయకులు, కనీసం ఎయిర్‌పోర్టుకు చేరుకునే రోడ్లను, ట్రాఫిక్ మేనేజ్
మెంట్‌ను ఎందుకు సమీక్షించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, ఆర్‌అండ్‌బీ అధికారుల మధ్య కనీసం చర్చలు లేవు. భూసేకరణ, నిధుల విడుదలపై పాలకుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఎయిర్‌పోర్ట్ ప్రారంభమైన తొలిరోజే రీజినల్ ట్రాఫిక్ ఘోరంగా స్తంభించి పోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ఎయిర్ పోర్టుకు ప్రయాణికులు, సరుకులు చేరేలా నాలుగు వైపులా అనుసంధాన రోడ్లు నిర్మించాలన్న కనీస జ్ఞానం కూడా సర్కార్‌కు లేకపోవడంపై ఉత్తరాంధ్ర సహా పొరుగు రాష్ట్రాల ప్రజలు విమర్శిస్తున్నారు.
ఎయిర్‌పోర్టు రెడీ అయినా పూర్తికాని కనెక్టివిటీ రోడ్లు
అనుసంధాన రోడ్ల నిర్మాణంపై దృష్టిపెట్టని చంద్రబాబు సర్కారు
విమాన ప్రయాణికులకు రోడ్డు కష్టాలు తప్పని వైనం
రెండు పొరుగు రాష్ట్రాల సరిహద్దు
ఎయిర్‌పోర్టుకు నలువైపులా రహదారి దిగ్బంధం!
విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్ల విస్తరణను పట్టించుకోని ప్రభుత్వం


