వంగర: మండల పరిధి మడ్డువలస కుడి ప్రధాన కాలువ నుంచి శనివారం నీటిసరఫరా పెంపుదల చేశారు. ఈ నెల 24న తొలిరోజు వంద క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఆయకట్టుకు సాగునీరు అందకపోవడంతో మరో 200 క్యూసెక్కుల నీటిని పెంచి మొత్తం 300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెడుతన్నామని ఏఈ నితిన్ తెలిపారు.
ఈవీఎం గోదాముల తనిఖీ
నెల్లిమర్ల: స్థానిక ఈవీఎం గోదాములను కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శనివారం తనిఖీ చేశారు. గోదాము షట్టర్లకు వేసిన సీళ్లను, తాళాలను పరిశీలించారు. పోలీస్ బందోబస్తుపై సమీక్షించారు. అంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు, పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. నెల్లిమర్ల తహసీల్దార్ శ్రీకాంత్, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ ప్రసాద్, ఇతర రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
గంట్యాడ: జిల్లాలో ఆగస్టు 1న ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ అధికారులను ఆదేశించారు. ఎయిర్‌పోర్టు ఆవరణలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారులు, సిబ్బంది సమన్వయంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. అప్పగించిన బాధ్యతలను క్రమశిక్షణతో నిర్వర్తించాలని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విధి స్థావరాలను వీడరాదన్నారు. బందోబస్తు సిబ్బందికి అవసరమైన అల్పాహారం, భోజన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీఎస్పీలు ఎస్.రాఘవులు, ఆర్.గోవిందరావు, పలువురు సీఐలు పాల్గొన్నారు.
శ్రీనివాసునికి చందన సేవ
విజయనగరం టౌన్: తొలి ఏకాదశి పర్వదినాన వేంకటేశ్వరస్వామి చందన అలంకరణలో శనివారం దర్శనమిచ్చారు. విజయనగరం టీటీడీ కల్యాణ మండపం ఆవరణలో కొలువైన శ్రీనివాసునికి ఆలయ ప్రధాన అర్చకులు పి.వి.నరసింహాచార్యులు వేకువజాము నుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి చందనపూతతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అరుంధతీనగర్‌లో కొలువైన వైభవ వేంకటేశ్వర స్వామికి అర్చకులు రాజేష్ శర్మ ఆధ్వర్యంలో విశిష్ట పూజలు నిర్వహించారు. స్వామివారికి తులసీదళాలు, పుష్పాలతో అలంకరించి పూజలు చేశారు. రింగు రోడ్డులో ఉన్న కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం, వివేకానంద కాలనీలో ఉన్న శ్రీనివాసునికి విశిష్ట పూజలు జరిగాయి. వందలాది మంది భక్తులు స్వామివారిని దర్శించి, తరించారు.


