● నగరంలోని దుకాణదారులకు
కార్పొరేషన్ అధికారుల ఆదేశం
విజయనగరం: విజయనగరం జిల్లా భోగాపురంలోని అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేళ దుకాణదారులకు ఉపాధి దూరమయ్యే పరిస్థితి దాపురించింది. దేశం నలుమూలల నుంచి పెద్దపెద్దోళ్లు వస్తున్నారని, తోపుడు బండ్లు, చిరు దుకాణాలను మూసివేయాలంటూ విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వారం రోజుల పాటు దుకాణాలు మూసేస్తే జీవితాలు ఎలా గడపాలని తోపుడు బండ్ల వాసులు, కూరగాయల వ్యాపారులు, చిరు దుకాణదారులు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై అవేవీ అనవసరం, అతిథుల కంట్లో మీ దుకాణాలు ఆదివారం నుంచి కనిపించకూడదంటూ అధికారులు హుకుం జారీ చేశారు.
అందుకేనా అత్యుత్సాహం...?
భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం నెపంతో మహారాజా కోట చుట్టూ ఉన్న చిరు వ్యాపారులను ఖాళీ చేయించాలని స్థానిక ఎమ్మెల్యే భావించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఇచ్చిన ఆదేశాల మేరకు వారు చిరు వ్యాపారులపై అత్యుత్సాహం కనబరుస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏళ్ల తరబడి చిరువ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నవారి పొట్టకొట్టడం తగదని, గతంలో కూడా మహారాజ కోట ఆధునికీకరణలో భాగంగా చాలా షాపులు తొలగించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


