భోగాపురం ఎయిర్‌పోర్ట్ కేవలం ఉత్తరాంధ్రకే కాక, సరిహద్దున ఉన్న ఒడిశా, ఛత్తీగఢ్ ప్రాంత వాసులకు, వ్యాపారులకు సైతం అత్యంత కీలకం. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల నుంచి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునే జాతీయ రహదారులకు అనుసంధానంగా ఉండాల్సిన ఫ్రీవేలు, బైపాస్ రోడ్ల నిర్మాణం కాగితాలకే పరిమితమయ్యాయి. పొరుగు రాష్ట్రాల నుంచి సరుకు రవాణా (కార్గో) వాహనాలు, ప్రయాణికులు రావాలంటే ఇప్పటికీ దశాబ్దాల నాటి ఇరుకు రోడ్లే దిక్కు. ప్రత్యామ్నాయ రహదారుల ఊసే ఎత్తడం లేదు.
● ఎయిర్‌పోర్ట్‌కు ఇరువైపులా ఉన్న ప్రధాన జిల్లా కేంద్రాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం నుంచి రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంలో ఆయా జిల్లాల యంత్రాంగాలు, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్న వాదన ఉంది. విశాఖ–భోగాపురం చీచ్‌రోడ్డు/ఎక్స్‌ప్రెస్ వే అంశం ప్రచారాలకే పరిమితమైంది తప్ప పనులు అడుగు ముందుకు పడలేదు. జిల్లా కేంద్రాల నుంచి ఎయిర్‌పోర్ట్‌ను కలిపే విజయనగరం, శ్రీకాకుళం లింక్ రోడ్లు, వాటి విస్తరణను పూర్తిగా పక్కనబెట్టేశారు. రేపు విమానాలు దిగాక ప్రయాణికులు నడిరోడ్డుపై గంటల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి దాపురించింది.


