పూసపాటిరేగ: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించను న్నారు. ఈ మేరకు ఏర్పాట్లను శుక్రవారం పలువురు ఉన్నతాధికారులు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ నోడల్ ఆఫీసర్ ఎం.టి.కృష్ణబాబు, స్పెషల్ ఆఫీసర్ వీర పాండ్యన్, రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ మల్లిఖార్జున్, ఏసీఎల్ ఎండీ ప్రవీణ్ ఆదిత్య, విశాఖ రేంజ్ ఐజీ గోపినాథ్ జెట్టి, ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్, తదితరులు ట్రంపెట్ బ్రిడ్జి, ప్రధాన అనుసంధాన రహదారులు, బహిరంగ వేదిక ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. పార్కింగ్ ప్రదేశాలను, మ్యాపులను పరిశీలించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి, భద్రతా పనులను శరవేగంగా పూర్తి చేయాలని జీఎంఆర్ అధికారులను ఆదేశించారు.
5వేల మందితో బందోబస్తు
ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి పీఎం మోదీ వస్తున్న సందర్భంగా 5వేల మంది పోలీసులతో బందోబస్తు విధులు నిర్వహిస్తామని ఎస్పీ దామో దర్ తెలిపారు. 17 విభాగాలుగా భద్రతా సిబ్బందిని విభజించామన్నారు. బందోబస్తు వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా డీజీపీకి వివరించారు. వాహనాల నిలుపుదలకు ప్రాథమికంగా 5 పెద్ద పార్కింగ్ స్థలాలతో పాటు, అదనంగా మరో 9 పార్కింగ్ స్థలాలను సిద్ధం చేశామన్నారు.


