● మక్కువలో ఎరువుల గోదామును తనిఖీచేసిన ఆర్డీవో
మక్కువ: మండలకేంద్రం మక్కువలోని గ్రంధి గున్నరాజు ఎరువుల గోదాములో భౌతిక నిల్వలకు, రికార్డులో ఉన్న నిల్వల్లో వ్యత్యాసం ఉన్నందున 6ఎ కేసు నమోదుచేసినట్లు ఆర్డీవో కె.మాధురి తెలిపారు. స్థానిక గ్రంథిగున్నరాజు ట్రేడర్స్ గోదామును ఆర్డీవో మాధురి గురువారం తనిఖీ చేశారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..సాలూరు మండలంలోని మావుడి రైతుసేవాకేంద్రం పరిధి కొట్టుపరువు గ్రామానికి చెందిన సత్తి శ్రీనివాసరెడ్డి తోటలో అక్రమంగా నిల్వ చేసిన సుమారు రూ.26లక్షల విలువజేసే 1344 పొటాష్ బస్తాలు నకిలీవంటూ ప్రాథమికంగా నిర్ధారిస్తూ ఈనెల 20వతేదీన వ్యవసాయశాఖ అధికారులు పట్టుకుని సీజ్ చేసి ల్యాబ్‌కు ఎరువులు శాంపిల్స్‌ను పంపించారు. తాజాగా బుధవారం మరో 312బస్తాల పొటాష్ ఎరువును వ్యవశాయశాఖ అధికారులు సీజ్‌చేశారు. ఈ 312బస్తాలు పొటాష్ ఎరువులు ఒరిజినల్ అయినప్పటికీ, బిల్లుల్లో తేడా ఉన్నందున, ఆరాతీయగా మక్కువకు చెందిన డీలర్ గ్రంధి కోటి నుంచి కొనుగోలుచేసి, నిల్వ చేసినట్లు రైతు సత్తి శ్రీనివాసరెడ్డి గుమస్తా వివరించినట్లు డీఏవో అన్నపూర్ణ తెలిపారు. ఈమేరకు ఆర్డీవో మాధురి ఎరువుల గోదామును తనిఖీచేశారు. స్టాక్ రికార్డులు, ఎరువుల నిల్వలు, రైతుల ఫిర్యాదు, వాంగ్మూలం కాపీలను ఆర్డీవో పరిశీలించారు. గోదాములో భౌతిక నిల్వలకు, రికార్డులో ఉన్న నిల్వలకు వ్యత్యాసం ఉండటంతో, డీలర్లను వివరణ కోరినప్పటికీ, వివరణ ఇవ్వకపోవడంతో 6ఎ కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాధురి మాట్లాడుతూ మావుడి రైతుసేవాకేంద్రం పరిధిలో కల్తీ ఎరువులు విక్రయించినట్లు ప్రాథమికంగా తేలడంతో, సీజ్ చేసిన ఎరువులు ల్యాబ్‌కు పంపించిన శాంపిల్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత, నకిలీవని తేలితే ఫెర్టిలైజర్ యాక్ట్ కింద కేసు నమోదుచేసే అవకాశముంటుందన్నారు. అంతకుముందు డీఏవో అన్నపూర్ణ, ఏడీఏ సత్యవతి, ఏవో భారతి గ్రంధి గున్నరాజు ట్రేడర్స్ దుకాణంలో ఎరువులు నిల్వలు, స్టాక్ రికార్డులు పరిశీలించారు.


