● లెక్కల్లో కనిపిస్తున్న ఖర్చు
● క్షేత్రస్థాయిలో కనిపించని పనులు
పాచిపెంట: పెద్దగెడ్డ జలాశయం కుడి కాలువ పూడికతీత, జంగిల్ క్లియరెన్‌న్స్ కోసం 19 పనులకు గాను రూ.84 లక్షలు ఖర్చు చేశామని, మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్వయంగా ఇటీవల ఖరీఫ్ సీజన్‌కు నీరువిడుదల చేసినప్పుడు, ఏర్పాటు చేసిన సభలో గొప్పగా చెప్పుకున్నారు. అయితే వాస్తవం అందుకు భిన్నంగా ఉంది. ఎందుకంటే కాలువను పరిశీలించిన రైతులు మాత్రం ‘పూడిక పోయిందెక్కడ?‘ అని ప్రశ్నిస్తున్నారు. జలాశయం మొదట బొండి వద్ద నుంచే పూడిక, పిచ్చిమొక్కలు కనిపిస్తుండడంతో అసలు పనులు ఎక్కడ జరిగాయనే చర్చ సాగుతోంది. కాలువ శుభ్రం కాకపోవడంతో చివరి ఆయకట్టుకు నీరు సకాలంలో చేరడం లేదన్న ఆవేదన రైతుల్లో నెలకొంది. ఖర్చు లెక్కల్లో కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో పనులు కూడా కనిపిస్తే బాగుండేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరి దీనిపై సంబంధిత అధికారులు ఎలాంటి వివరణ ఇస్తారో వేచి చూడాలి.


