విజయనగరం గంటస్తంభం:
నిరుద్యోగులతో ఆటలొద్దు.. ప్రభుత్వం ప్రకటించిన 2,500 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులను 10వేల వరకు పెంచాలి.. ఉద్యోగాల భర్తీలో వయోపరిమితిని 35 ఏళ్లకు పెంచాలి.. జీఓ నెం.46ను వెంటనే రద్దు చేయాలంటూ డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం కోట కూడలి నుంచి మూడు లాంతర్లు, కన్యకాపరమేశ్వరి ఆలయం మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీఆర్వో ఇ.సత్తిబాబుకు వినతిప్రతం అందజేశారు. ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ సీహెచ్ హరీష్ మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఉద్యోగ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం, రెండేళ్లుగా నిరుద్యోగులకు నిరాశ కలిగించేలా తక్కువ పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందని విమర్మించారు. రాష్ట్రంలో సుమారు 19వేల పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నాయని మంత్రలే ప్రకటించారని, అలాంటిప్పుడు కేవలం 2,500 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం అన్యాయమన్నారు. గత కొన్నేళ్లేగా పోలీస్ నియామకాలు లేకపోవడంతో వేలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటే పరిస్థితి ఏర్పడిందని, అందువల్ల వయోపరిమితిని 35 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువకుడు నవీన్ మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వేలాది మంది అభ్యర్థులు అద్దె గదుల్లో ఉంటూ, రీడింగ్ హాళ్లలో కష్టపడి చదువుతున్నారని, ప్రభుత్వం వారి పరిస్థితిని గుర్తించి న్యాయం చేయాలని కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే భవిష్యత్తులో చలో విజయవాడ పేరుతో భారీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నిరుద్యోగ యువతతో పాటు డీవైఎఫ్‌ఐ నాయకులు, వందలాదిమంది నిరుద్యోగులు పాల్గొన్నారు.
ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు 10 వేలకు పెంచాలి
వయో పరిమితిని 35 ఏళ్లకు పెంచి.. జీఓ 46 రద్దు చేయాలి
డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగుల ఆందోళన


