నెల్లిమర్ల రూరల్: విశాఖలోని కొత్తరోడ్డులో కొలువైన జగన్నాథస్వామి వారికి రామతీర్థం శ్రీరామస్వామి దేవస్థానం తరఫున గురువారం పట్టువస్త్రాలు సమర్పించారు. ఏటా ఆషాడమాసంలో జరిగే స్వామివారి రథయాత్ర అనంతరం పది రోజుల పాటు జగన్నాథస్వామి దశావతారాల్లో భక్తులకు దర్శనమిస్తుంటారు. ఈ నేపథ్యంలో గురువారం రామావతారంలో స్వామిని అలంకరించగా.. సంప్రదాయబద్ధంగా ఆలయ ఈఓ వై శ్రీనివాసరావు, అర్చకులు అక్కడికి చేరుకుని పట్టువస్త్రాలు, పూజా సామగ్రి అందజేశారు.
26న రాష్ట్రస్థాయి జూనియర్స్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికలు
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న జూనియర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలు ఈనెల 26న నిర్వహించనున్నట్టు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు లీలాకృష్ణ, శ్రీకాంత్ గురువారం తెలిపారు. ఆ రోజు ఉదయం 9 నుంచి నగర శివారుల్లో గల విజ్జీ స్టేడియం ప్రాంగణంలో ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అండర్–14, 16, 18, 20 వయస్సుల విభాగాల్లో బాల, బాలికలకు రన్స్, త్రోస్, జంప్స్ అంశాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను వచ్చేనెల 11 నుంచి 13వ తేదీ వరకు తిరుపతిలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. అర్హత, ఆసక్తి గల క్రీడాకారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ
విజయనగరం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) చేపట్టిన రెండవ దశ ఉద్యమంలో భాగంగా గురువారం స్థానిక డిపోలో విస్తృత సంతకాల సేకరణ కార్య క్రమం నిర్వహించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు డిపోలోని ప్రతి ఉద్యోగి ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని సంతకాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ స్థానిక నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర జేఏసీ తీర్మానం ప్రకారం ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలని ఈ నెల 27 తేదీన కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రికి సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేస్తామన్నారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా కన్వీనర్ పీజీరాఫెల్, జి.రవికాంత్, కో–కన్వీనర్లు బి.రామారావు, సీహెచ్.శ్రీనివాసరావు, ఎ.చంద్రయ్యతో పాటు పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు, జేఏసీ భాగస్వాములు, డిపో సిబ్బంది పాల్గొన్నారు.
ఎంతమందికి
ఉద్యోగాలిచ్చారు బాబూ?
విజయనగరం గంటస్తంభం: భోగాపురం విమానాశ్రయం కోసం భూములిచ్చిన రైతులకు ఎన్ని ఉద్యోగాలు కల్పించారో కూటమి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు వెల్లడించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఎల్‌బీజీ భవన్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతుల నుంచి భూములు తీసుకున్నప్పటికీ ఉపాధి, ఉద్యోగ హామీలు అమలు చేయలేదన్నారు. స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పించాలని, రైతులకు పూర్తి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు రెడ్డి శంకరరావు పాల్గొన్నారు.


