విజయనగరం: బాధ్యత గల జర్నలిజం రంగంలో ఉన్నత స్థాయిలో ఉన్న ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఎం.డి.రాధాకృష్ణ మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారణమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ మహిళా నాయకులు, కార్యకర్తలను ఉద్దేశిస్తూ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు యావత్ మహిళాలోకం మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి వ్యక్తిపై విజయనగరంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఇప్పటికే రెండు సార్లు ఫిర్యాదుచేసినా కనీసం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా నిర్లక్ష్యం నటించడంతో ఎస్పీ దృష్టికి సమస్యను తీసుకువచ్చామన్నారు. ఈ మేరకు గురువారం ఎస్పీ కార్యాలయంలో జిల్లా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ అధికార బలం, ప్రభుత్వం అండదండలు చూసుకుని మహిళల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వాటిని ఏబీఎన్, ఆంధ్రజ్యోతి మీడియాలో ప్రచురించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేఖంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే వారిపై తప్పుడు కేసులు బనాయిస్తున్న ప్రభుత్వం రాధాకృష్ణ లాంటి వ్యక్తులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. విజయనగరం జిల్లా కేంద్రంలో పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఎస్పీ కార్యాలయంలో సమస్యను చెప్పుకునేందుకు వస్తే ఒక్క అధికారి అందుబాటులో లేకపోవడం దారుణమన్నారు. ఓ రాజకీయ పార్టీ తరఫున తమకే ఇటువంటి పరిస్థితి ఎదురైతే సాధారణ ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. మహి ళలపై అనుచిత వాఖ్యలు చేసిన రాధాకృష్ణ భేషరతుగా క్షమాపణ చెప్పాలని, అతనిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మహిళలతో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత, పార్టీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు, యువజన విభాగం నాయకులు జి.ఈశ్వర్ కౌశిక్, నగర యువజన విభాగం అధ్యక్షుడు చెల్లూరి భార్గవ్, ఉపాధ్యక్షుడు అవనాపు లక్ష్మణరావు, నియోజకవర్గ బూత్‌లెవెల్ కమిటీ ఇన్‌చార్జి బండారు ఆనంద్, సప్పా ప్రసాద్, తాళ్లపూడి గణేష్ , బొంగ భానుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం దారుణం
పోలీస్ యంత్రాంగం తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి
ఎస్పీ కార్యాలయంలో పిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ నాయకులు


