అందరికీ కాదు.. కొందరికీ వందనం..! | - | Sakshi
Sakshi News home page

అందరికీ కాదు.. కొందరికీ వందనం..!

Jul 24 2026 1:39 AM | Updated on Jul 24 2026 1:39 AM

నిబంధనల పేరుతో షాక్‌

హౌస్‌ మ్యాపింగ్‌ తప్పిదాలతో

అడ్డగోలుగా అనర్హత

విజయనగరం అర్బన్‌ / రామభద్రపురం : అర్హులందరికీ తల్లికి వందనం పథకం అందిస్తున్నామని.. ఎంత మంది పిల్లలుంటే అందరికీ జమ చేస్తున్నామన్న చంద్రబాబు ప్రభుత్వం గొప్పలకు.. వాస్తవానికి పొంతన కుదరడంలేదు. లెక్కలన్నీ అంకెల్లోనూ.. ప్రజా ప్రతినిధుల గొప్పల్లోనూ కనిపిస్తున్నాయని తల్లిదండ్రులు అంటున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక.. జిల్లాలో వేలాది మంది పథకానికి దూరమైన పరిస్థితి ఉంది. వేరొకరి కరెంటు బిల్లులు ఆధార్‌తో లింకు కావడం, భూమి లేకున్నా ఉన్నట్లు చూపడం వల్ల లబ్ధిదారులు పథకానికి దూరమవుతున్నారు.

కొత్త నిబంధనలు ఇలా..

విద్యార్థికి సంబంధిత విద్యా సంవత్సరంలో కనీసం 75 శాతం హాజరుతప్పనిసరి. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ నెలసరి ఆదాయం రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలు లోపు ఉండాలి. గత 12 నెలల సగటు విద్యుత్‌ వినియోగం 300 యూనిట్లకు మించకూడదు. 3 ఎకరాల కంటే తక్కువ పల్లం భూమి, లేదంటే 10 ఎకరాల కంటే తక్కువ మెట్ల భూమి ఉండాలి. నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. పట్టణాల్లో వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇల్లు/ఆస్తి ఉండకూడదు. తల్లి బ్యాంక్‌ ఖాతా తప్పని సరిగా ఆధార్‌ సీడెడ్‌ అయి, ఎన్‌పీసీఐ యాక్టివేట్‌ అయి ఉండాలి. స్కూల్‌ రికార్డుల్లో విద్యార్థుల వివరాలు, ఆధార్‌ లేదా తల్లి పేరులో చిన్న అక్షర దోషాలు ఉన్నా సిస్టంలో ఆటోమేటిక్‌గా అప్లికేషన్‌ తిరస్కరణకు గురవుతోంది.

సరిచేయండి సారూ..

నా మనవరాలికి గతేడాది తల్లికి వందనం డబ్బులు పడ్డాయి. ఈ ఏడాది పడలేదంటూ రామభద్రపురం మండలంలోని రావివలసకు చెందిన దమ్మి తమ్మయ్య ఇన్‌చార్జి తహసీల్దార్‌ సాయికృష్ణకు గోడు వినిపించాడు. రావివలసకు చెందిన తమ్మయ్యకు కుమారుడు పెంటయ్యకు 3.25 ఎకరాల పొలం మాత్రమే ఉంది. అయితే అతడి ఆధార్‌ కార్డు నంబర్‌ పొరపాటున ఇంకొకరి భూమికి లింక్‌ అయింది. దీంతో పెంటయ్య పేరున సుమారు 10 ఏకరాల పైగా భూమి ఉన్నట్లు 1బీలో చూపిస్తోంది. ఈ కారణంగా తల్లికి వందనం పథకం నిలిపివేశారు. వెంటనే అనధికారికంగా నమోదైన భూమిని తొలగించాలని తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశాడు.

చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు సిగడం ఉష. విజయనగరం పట్టణంలోని దర్మపురి గ్రామం. ఆమెతో పాటు భర్త పాపునాయుడు రోజుకూలీలు. వీరి ఇద్దరు పిల్లల్లో షణ్ముకసాయి రెండో తరగతి, భాను ప్రకాశ్‌ మూడో తరగతి చదువుతున్నారు. వీరిలో రెండేళ్లుగా ఒక్కరికీ తల్లికివందనం లబ్ధి అందుతోంది. దీనిపై సచివాలయ సిబ్బందిని సంప్రదిస్తే మ్యాపింగ్‌లో భార్యాభర్తలు వేర్వేరుగా జీవిస్తున్నట్టు నమోదైంది. గతేడాది సరిచేయాలని విన్నవించినా ఫలితం లేకపోయిందంటూ కూలి దంపతులు వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement