● నేరు మడ్డువలస ప్రాజెక్టు సాగునీరు
విడుదల
● గతమెన్నడూ లేని విధంగా ఆలస్యంగా నీటి విడుదల
వంగర: చినుకు రాలదు...చింత తప్పదు అన్నచందంగా మడ్డువలస ప్రాజెక్టు పరిస్థితి దాపరించింది. ఈ ఏడాది వర్షాల జాడ లేదు. నదుల నుంచి ఇన్‌ఫ్లో రాకపోవడంతో ప్రాజెక్టులో నీటిమట్టం డెడ్ స్టోరేజీలో ఉంది. గతమెన్నడూ లేని విధంగా ఈ ఏడాది సాగునీటి నిల్వలు అడుగంటుతున్నాయి. ఖరీఫ్ సీజన్ ఆరంభమై నెలన్నర గడుస్తున్నా వర్షాలు లేక సాగునీటిని విడుదల చేయలేని స్థితి. ఆయకట్టులో రైతన్న సాగునీటిని కష్టాలను దుష్టిలో పెట్టుకొని అధికారులు సాగునీటి విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. అరకొర నీటి నిల్వలున్న మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ ద్వారా శుక్రవారం సాగునీటిని విడుదల చేయనున్నారు. ప్రాజెక్టులో ఉన్న నీరు 15–20 రోజులు మాత్రమే ఆయకట్టుకు సరఫరా చేసే పరిస్థితి ఉంది. దీంతో అన్నదాతలు వరుణిడి కరుణ కోసం ఎదురు చూస్తున్నారు.
ప్రాజెక్టులో నీటి నిల్వలు ఇలా.....
మడ్డువలస ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 65 మీటర్లు. ఈ లెక్కన 3.37 టీఎంసీల నీరు ఉండాలి. అయితే, ప్రస్తుతం 62.28 మీటర్లు లెవెల్ నీటిమట్టం ఉంది. 1.25 టీఎంసీల నీరు ఉంది. వర్షాలు కురవకుంటే 15 రోజుల్లో డెడ్ స్టోరేజీకి ప్రాజెక్టు చేరుకుంటుంది.
ఆయకట్టు వివరాలు.....
ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువ ద్వారా 31వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. అయితే వర్షాభావ పరిస్థితులు కారణంగా ఈ ఏడాది తొలిఫేజ్‌లో ఉన్న 24,877 ఎకరాలకు సాగునీటి అందించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎడమ ప్రధాన కాలువ నుంచి వంగర మండలంలో 996 ఎకరాలకు, కుడి ప్రధాన కాలువ నుంచి రేగిడి–6,777, సంతకవిటి–10,976, జి.సిగడాం–6,029, పొందూరు–99 ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందించనున్నారు. వర్షాలు పుష్కలంగా కురిస్తే రెండో ఫేజ్‌లో ఉన్న మరో 6వేలు ఎకరాలకు సాగునీటిని అందించగలమని అధికారులు చెబుతున్నారు.


