● విశాఖ కేజీహెచ్‌లో ప్రత్యేక
ఐసోలేషన్‌లో చికిత్స
పార్వతీపురం రూరల్: మన్యం జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకుడు ఉపాధి నిమిత్తం విశాఖ నగర శివార్లలోని పెందుర్తి ప్రాంతంలో సముద్రపు చేపలకు సంబంధించిన వ్యాపార సంస్థలో కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా మలేరియా జ్వరంతో బాధపడుతున్న యువకుడికి ఎంతకూ జ్వరం తగ్గకపోవడంతో మెరుగైన వైద్యం కోసం విశాఖలోని కింగ్ జార్జ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు యువకుడి రక్త నమూనాలు సేకరించి వైరాలజీ ల్యాబ్‌లో పరీక్షించగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు విశాఖ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి అధికారికంగా తెలిపారు. ప్రస్తుతం ఆ యువకుడిని కేజీహెచ్‌లోని ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యవర్గాలు వెల్లడించాయి.ఈ ఘటనపై అధికారులు చేపట్టిన దర్యాప్తులో బాధితుడు పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ, దాదాపు ఏడాది కాలంగా సొంత గ్రామానికి రాలేదని తేలింది. ఈ నేపథ్యంలో మంగళవారం తలెత్తిన పలు అనుమానాలపై స్పందించిన మన్యం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.. ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లాలో ఎలాంటి కరోనా కేసులు లేవని స్పష్టం చేశారు.


