విజయనగరం ఫోర్ట్:
కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 251 వినతులు వచ్చాయి. ఇందులో 126 రెవెన్యూకు సంబంధించివి. డీఆర్వో సత్తిబాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. డీఆర్‌డీఏకు 15, విద్యాశాఖకు 9, విద్యుత్ శాఖకు 5, సచివాలయ శాఖకు 7, జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు 6, గృహ నిర్మాణ శాఖకు 2, ఇతర శాఖలకు 149 వినతులు వచ్చాయి. ఈ సందర్భంగా డీఆర్వో సత్తిబాబు మాట్లాడుతూ 1100 ట్రోల్‌ఫ్రీ ద్వారా అందుతున్న ఫిర్యాదులను అత్యంత బాధ్యతతో పరిష్కరించాలన్నారు. ప్రతీ అర్జీదారునితో నేరుగా మాట్లాడిన తరువాతే ఎండార్స్‌మెంట్ ఇవ్వాలన్నారు. మెంటాడ మండలం రెడ్డివానివలస గ్రామంలో ప్రాధమిక పాఠశల భవనం పనులు పూర్తి చేయాలంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు కోరారు. 28 మంది పిల్లలున్నా.. అనువైన భవనం లేకపోవడంతో అవస్థలు పడుతున్నారని తెలిపారు. పింఛన్ పెంచాలంటూ గరివిడికి చెందిన దివ్యాంగుడు రాంబాబు వినతి ఇచ్చారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వరావు, కళావతి, అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.
పాఠశాల భవనం
కోసం ప్లకార్డులు ప్రదర్శిస్తున్న విద్యార్థులు


