● బిల్లులు మంజూరైనా చెల్లించని అధికారులు
● కేంద్రానికి తాళం వేసిన కాంట్రాక్టర్
గుర్ల: మండలంలోని వల్లాపురం రైతు సేవా కేంద్రం నిర్మాణాలకు సంబంధించి బిల్లు మంజూరైనా అధికారులు చెల్లించడానికి నిరాకరిస్తుండడంతో సంబంధిత కాంట్రాక్టర్ కేంద్రానికి సోమవారం తాళం వేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ కేంద్రం నిర్మాణానికి సంబంధించి బిల్లులు కొద్ది రోజుల కిందట మంజూరయ్యాయి. అయితే పనులు చేసిన కాంట్రాక్టర్ శ్రీనివాసరావుకు అధికారులు ఆ మొత్తం బిల్లుల చెల్లింపునకు నిరాకరిస్తున్నారు. ఈ క్రమంలో కాంట్రాక్టర్ ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ పలుమార్లు తిరిగినా ఫలితం లేకుండా పోయింది. దీంతో విసిగిపోయిన కాంట్రాక్టర్ శ్రీనివాసరావు సోమవారం కేంద్రానికి తాళం వేశాడు. ఈ రైతు సేవా కేంద్రానికి సంబంధించి రెండు వారాల కిందట సుమారు రూ.లక్షా 60 వేలు ప్రత్యేకాధికారి ఖాతాలో నగదు జమైంది. ఈ మొత్తాన్ని సంబంధిత కాంట్రాక్టర్‌కు చెల్లించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలూ వచ్చాయి. అయినా బిల్లుల చెల్లింపులో ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యం వహించారు. దీంతో కేంద్రానికి కాంట్రాక్టర్ తాళం వేశాడు. అయితే రైతులకు సరఫరా చేయాల్సిన ఎరువులు ఇందులో ఉండడంతో ఏఓ తిరుపతిరావు, ఎంపీడీఓ రవికుమార్ రైతు సేవా కేంద్రానికి వచ్చి బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. బిల్లు చెల్లించిన తరువాతే తాళం తీస్తానని కాంట్రాక్టర్ చెప్పడంతో అధికారులు వెనుదిరిగారు.


