● ద్వితీయ స్థానంలో కుమిలి
● తృతీయ ఉమ్మడి విజేతలుగా పూసపాటిరేగ, గంగచోళ్లపెంట
విజయనగరం: స్వర్గీయ పోరాల అనిల్ కుమార్ యాదవ్ జ్ఞాపకార్థం నిర్వహించిన జిల్లా స్థాయి ఆహ్వానపు పాఠశాల విద్యార్థుల ఖోఖో పోటీల్లో విజేతగా కస్పా ఉన్నత పాఠశాల జట్టు నిలిచింది. ద్వితీయ స్థానాన్ని కుమిలి ఉన్నత పాఠశాల జట్టు దక్కించుకోగా..తృతీయ స్థానాన్ని ఉమ్మడిగా పూసపాటిరేగ, గంగచోళ్ల పెంట జట్లు కై వసం చేసుకున్నాయి. జిల్లా ఖోఖో అసోసియేషన్ సారథ్యంలో జాతీయ ఖో ఖో క్రీడాకారుడు తురాల అనిల్ కుమార్ యాదవ్ మిత్రబృందం ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి 15 జట్లు పాల్గొన్నాయి. ఆదివారం నిర్వహించిన పోటీలను జిల్లా ఖోఖో అసోసియేషన్ చైర్మన్ పెనుమజ్జి విజయలక్ష్మి, ఒలింపియన్ మాణిక్యాలరావు, తూరాల శ్రీనివాసులు ప్రారంభించారు. పోటీల ముగింపు అనంతరం విజేతలుగా నిలిచిన జట్లకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు ఏఎన్‌ఎం కమలనాభరావు, కార్యదర్శి కె.గోపాల్, ఆర్గనైజింగ్ కార్యదర్శి మల్లికార్జునరావు, కేఏ బాలకృష్ణ, వ్యాయామ ఉపాధ్యాయులు సత్యనారాయణ, రాము, శ్రీను, వరలక్ష్మి, విజయ, వాణి, స్వర్గీయ అనిల్ కుమార్ మిత్రులు పొంతపల్లి హరీష్, రాము, మహారాజులు పాల్గొన్నారు.


