కొమరాడ: ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉదయించిన జానపద గళం కాళ్లకు గజ్జెలు కట్టి జజ్జనకరి జనారే అంటూ శ్రోతలను ఓలలాడిస్తోంది. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా బతకడానికి దారి దీపం చూపిన జానపద గాన మాధుర్యం వేలాదిమంది అభిమానాన్ని మూటగట్టి వందల పురస్కారాలు సాధించింది. ఈ ఖ్యాతి సాధనలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా ధైర్యంగా ఎదురొడ్డి నిలిచిన తెలుగు పండితుడు దామోదర గణపతిరావు పార్వతీపురం జిల్లా ముద్దు బిడ్డ కావడం గర్వకారణం. ఉమ్మడి విజయనగరం జిల్లా కొమరాడ మండలం వన్నాం గ్రామంలో జన్మించిన గణపతిరావు బాల్యం, విద్యాభ్యాసం స్వగ్రామంతో పాటు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో జరిగాయి. తర్వాత బాపట్ల జిల్లాలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. ఆంధ్రాయూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రెండు ఎంఏలు చదువుకున్నారు. విజయవాడలో ఓ దినప్రతికలో రిప్రెజెంటేటివ్‌గా చేరి ఇంటింటికీ వెళ్లి పేపరు బుక్ చేసేవారు. ఓ కాలేజీలో పార్ట్‌టైమ్ అధ్యాపకుడిగా పనిచేశారు. ఇలా చిరుద్యోగాలు చేస్తూనే మరోవైపు ఉత్తరాంధ్రాలో నేర్చుకున్న ప్రబలమైన జానపద బాణీలతో తనదైన శైలిలో దూసుకుపోయారు. ప్రజా గాయకుడు వంగపడు ప్రసాదరావు, విప్లవ జానపద గాయకుడు గద్దర్, సహజ కవి, పాటల తూటా గంట్యాడ గౌరినాయుడు శిష్యరికంలో ఉమ్మడి రాష్ట్రంతోపాటు దేశ, విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. ఇందుకోసం 11మంది శిష్యలను తయారు చేసుకుని ఈ మహాయజ్ఞంలో భాగస్వాములను చేశారు. ముంబై, బెంగళూరు, చైన్నె, అహ్మదాబాద్, పూణె, రాయగడ, కోల్‌కతా, హోసూర్, లక్నో నగరాల్లో ప్రదర్శనలిచ్చి తెలుగు వెలుగులు నింపారు. కువైట్, దుబాయ్, మలేషియా దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. కరోనా సమయంలో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు ఆనందాన్ని ప్రపంచమంతటా కలిగించారు. ఆ సమయంలో ఆన్‌లైన్ వేదికగా జానపద గళం వినిపించేశారు. 1994లో కృష్ణా జిల్లా వెలగలేరు పాఠశాలలో భాషా పండితుడిగా చేరిన గణపతిరావు మాతృభాషా వైభవాన్ని చాటుతూ ప్రత్యేక ప్రదర్శనలిస్తూ తన లక్ష్యం నెరవేర్చుకుంటున్నారు. ప్రస్తుతం గన్నవరం మండలం ముస్తాబాద్ జెడ్పీ హైస్కూల్‌లో పనిచేస్తున్నారు.
’నాటకాల్లోనూ ప్రతిభ
నాటకాల్లోనూ దామోదర గణపతిరావు ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రముఖ కళాకారుడు, నంది అవార్డు గ్రహీత పీవీఎన్ కృష్ణ ఆహ్వానం మేరకు ఆయన నాటక రంగ ప్రవేశం చేశారు. 2007లో నెల్లూరులో జరిగిన నంది నాటకోత్సవాల్లో బంగారు నందిని పొందిన 1857 ప్రథమ స్వాతంత్య్ర మహాసంగ్రామం, 2008లో ఖమ్మంలో రజిత నంది పొందిన ‘శ్రీఖడ్గతిక్కన’ 2009లో నంద్యాలలో కాంస్య నంది పొందిన ‘ఉషా పరిణయం’ వంటి నాటకాల్లో ఆయన ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటివరకు వందకు పైగా నాటకాల్లో నటించారు. జీ తెలుగు వారి ‘షిరిడీ జైసాయిరాం, దూరదర్శన్ లోని ‘వజ్రభారతి’, శ్రీవెంకటేశ్వర భక్తి చానల్‌లో ‘పురాణగాథలు’ సీరియల్‌లో నటించారు. ఈయనను ఆకాశ వాణి బి గ్రేడ్ జానపద గాయకుడిగా, నటుడిగా గుర్తించింది.
బిరుదులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కతిక శాఖ జానపద కళారత్న, అవనిగడ్డ గాంధీక్షేత్రం వ్యవస్థాపకుడు మండలి బుద్ధప్రసాద్ నుంచి ‘ఆంధ్రా గద్దర్, పాలకొల్లు కళాలయ సాంస్కృతిక సంస్థ ‘కవిగాయక నటచక్రవర్తి’ బిరుదులు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ జానపద కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, యూటీఎఫ్ రాష్ట్ర సాంస్కృతిక కమిటీ సభ్యుడిగా, సంస్కార భారతి జిల్లా కార్యదర్శిగా, కృష్ణవేణి జానపద గాయక బృందం వ్యవస్థాపక కార్యదర్శిగా ప్రస్తుతం ఆయన పనిచేస్తున్నారు.
మార్మోగుతున్న ఉత్తరాంధ్ర
జానపదగళం
జానపద కళాకారుడు దామోదర గణపతిరావును వరించిన
పురస్కారాలు


