పెరిగిన నిమ్మ దిగుబడి | - | Sakshi
Sakshi News home page

పెరిగిన నిమ్మ దిగుబడి

Jun 29 2026 12:53 AM | Updated on Jun 29 2026 12:53 AM

పెరిగిన నిమ్మ దిగుబడి

సీతంపేట: మన్యంలో ఈ ఏడాది నిమ్మ దిగుబడులు బాగా పెరిగాయి. ఇప్పుడిప్పుడే మార్కెట్‌లోకి నిమ్మకాయలను గిరిజన రైతులు తెచ్చి విక్రయిస్తున్నారు. అంతగా పెట్టుబడులు అక్కర్లేక పోయినప్పటికీ ఏజెన్సీలో సుమారు 2 ఎకరాల వరకు పంటను కొండపోడు వ్యవసాయంలో భాగంగా పండిస్తారు. సీతంపేట ఏజెన్సీలో ఈ సంవత్సరం అధికంగా దిగుబడులు ఉన్నాయి. కావిడ నిమ్మకాయలు అంటే 30 నుంచి 40 కిలోలు సరాసరి రూ.400 నుంచి రూ. 500 వరకు విక్రయిస్తున్నామని గిరిజనులు తెలిపారు. గతేడాది ఇదే సీజన్‌లో ఒక్కో కావిడ రూ. 600 వరకు విక్రయించేవారమని గిరిజనులు చెబుతున్నారు. ఒక్కో నిమ్మ పండు మైదాన ప్రాంతాల్లో రెండురూపాయల వరకు విడిగా విక్రయిస్తారు. ఇక్కడ ఒక్కో పండు అర్ధరూపాయికి సరాసరి కారుచౌకగా కొనుగోలు చేసిన వ్యాపారులు పట్టణాల్లో అధికంగా విక్రయించి లాభాలను ఆర్జిస్తారు.

మైదాన వ్యాపారులదే హవా

విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఒడిశా ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఇక్కడికి వచ్చి నిమ్మకాయలు కొనుగోలు చేస్తారు. సీతంపేటలో సోమవారం, మర్రిపాడులో బుధవారం, గురువారం దోనుబాయి, కుశిమి, పొల్ల గ్రామాల్లో శనివారం వారపు సంతలు జరుగుతాయి. ఈ సంతలకు వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తారు. గిరిజన రైతులు చెప్పిన ధర కాకుండా వ్యాపారులు సిండికేట్‌గా మారి ధర నిర్ణయిస్తారు. దీంతో వారు చెప్పిన ధరలకు ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని గ్రామాల్లో గిరిజనులు ముందుగా దళారీ వ్యాపారుల నుంచి అడ్వాన్స్‌ తీసుకుంటారు. పంట పక్వానికి వచ్చే సమయంలో ఆ పంటను వ్యాపారులకు ఇస్తారు. ఇలా కూడా గిరిజనులు నష్టాలు చవిచూడాల్సి వస్తోంది.

కావిడ రూ.400 నుంచి 500 వరకు విక్రయం

ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు

తరలింపు

కొండపోడులో సాగుచేస్తున్న రైతులు

వారపు సంతల్లో విక్రయాలు

శ్రమకు తగ్గ ఫలితం లేదు

శ్రమకు తగ్గ ఫలితం లేదు. కావిడలు మోసుకుని తీసుకువస్తాం. తీరా వాటిని తక్కువ ధరలకు విక్రయించాల్సి వస్తుంది. ప్రత్యేక మద్దతు ధరలు లేవు. దీంతో వ్యాపారులు నిర్ణయించిన ధరలకు అమ్మకాలు చేయాల్సిన పరిస్థితి ఉంది.

బాలరాజు,పొంజాడ

సేకరణ చాలా కష్టం

కొండలపై పండే ఈ పంటను సేకరించడం చాలా కష్టసాధ్యమైన పని. ఇంటిల్లిపాది సేకరణకు వెళ్తే రోజుకు ఒక కావిడ వరకు మాత్రమే సేకరించగలం. అయితే ఆరుగాలం శ్రమించి పండించిన ఈ పంటకు మద్దతు ధరలు పెద్దగా ఉండడం లేదు.

ఎస్‌.బాపన్న, అక్కన్నగూడ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement